A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Tuesday, November 12, 2013

యక్ష ప్రశ్నలు



*మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మ రాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. వ్యవహారికములో చిక్కు ప్రశ్నలను, సమాధానం కష్టతరమైన ప్రశ్నలకు పర్యాయంగా యక్ష ప్రశ్నలు అనే మాటను వాడతారు.

* పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరణి లేడికొమ్ములలో యిరుక్కొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృశ్యవాణి పలికినది... ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు
* 72 ప్రశ్నలు-జవాబులు

*ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)

12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తృణం కంటె దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ఞానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ఞానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ఞానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ఞానం)

62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు)

Thursday, October 31, 2013

దీపావళి

శ్రీ గురుభ్యోనమః
మీ అందరికీ ముందస్తుగా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!


అందరూ దీపావళి పండుగను చక్కగా అందంగా ఆనందంగా ప్రమాదరహితంగా జరుపుకోవాలని కోరుకుంటూ, పోయిన సంవత్సరం పంచుకున్న దానికి కొద్ది మార్పులతో.. దీపావళి గూర్చి చిన్న వివరాన్ని రోజు చేయవలసిన విధులు అందరికీ ఉపయోగపడతాయని పొందుపరిచాను.

"ప్రాతః స్నానంతు యఃకుర్యాత్ యమలోకం నపశ్యతి" - విధిగా నిత్యమూ వేకువ ఝామునే స్నానం చేసినవానికి యమలోక దర్శనముండదని చెప్తారు పెద్దలు. స్నానం యొక్క పవిత్రత అది. ఎప్పుడోఅప్పుడు ఎలాగో అలాగ ఒళ్ళుకడుక్కోవడం స్నానం కాదు నియమంగా నియమిత వేళలో, నియమిత విధిలో స్నానం చేయాలి అది బాహ్యాంతరశ్శుచిని వృద్ధిని కలిగిస్తుంది.

ఆశ్వయుజ బహుళ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా
యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే

నరక చతుర్దశినాడు సూర్యోదయాత్ పూర్వం నువ్వులనూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలి. దీనివలన కలిగే ఫలితం కేవలం ఋష్యాదులు మాత్రమే దర్శించగలరు దాని ఫలితం ఇంత అని మానవ మాత్రులు దర్శించలేరు. యతులతో సహా అందరూ ఇలాగే రోజు స్నానం చేయాలని శాస్త్రవాక్కు.

అలానే దీపావళినాడు నూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలి
తైలే లక్ష్మీ ర్జలే గంగా దీపావళి తిథౌ వసేత్
అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే


దీపావళినాడు సూర్యోదయాత్ పూర్వం రాత్రి చివరి ఝాములో లేదా సోర్యోదయానికి 4ఘడియల ముందుగా (అంటే కనీసం 4-4:30 మధ్యకాలం అనుక్కోండి) నువ్వుల నూనె తో తలంటుకుని స్నానం చేయాలి. దీపావళినాడు సమయంలో ఎక్కడెక్కడున్న నువ్వులనూనెలోనూ లక్ష్మీదేవి, అలాగే అన్ని నీటి స్థానాలలోనూ గంగాదేవి నివసించి ఉంటారు. కనుక సమయంలో నువ్వులనూనె వంటికి రాసుకుని, తలంటుకొని స్నానం చేసినవారికి అలక్ష్మి పరిహరింపబడుతుంది. అలాగే గంగా స్నాన ఫలితం దక్కుతుంది. స్నానం చేసేటప్పుడు పైశ్లోకాన్ని ఒక్కసారి పఠించి నమస్కరించి స్నానం చేయడం మంచిది.  అలాగే ఇలా సూర్యోదయానికి ముందు అరుణోదయ సమయంలో (అంటే సూర్యోదయానికి 4 ఘడియల పూర్వం రమారమి 4-4:30 మధ్యలో) ప్రకారం స్నానం చేసినవారికి యమ లోకము కనపడదు.

అపామార్గం మథౌతుంబీం ప్రపున్నాట మథాపరం
భ్రామయేత్ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవై

స్నానం మధ్యలో ఉత్తరేణి, ఆనప లేదా ప్రపున్నాట మొక్కను తల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ స్నానం చేయాలి. అలాచేస్తే నరక ప్రాప్తి లేదు. అకాల మృత్యువు రాదు అని శాస్త్రం పెద్దల వాక్కు. ఉత్తరేణి లేదా అపామార్గ చాలా విరివిగా దొరుకుతుంది. లేకపోయినా ఆనప, ప్రపున్నాట మొక్కలను వాడవచ్చు. ఇలా స్నాన మధ్యంలో మొక్కలను తల చుట్టూ తిప్పుతూ ఉన్నప్పుడూ క్రింది ప్రార్థనా శ్లోకం / మంత్రం చెప్పుకోవాలి

శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః 

తా: దున్నిన మట్టి పెళ్ళలతో కలిసినది, ముళ్ళతో ఉండే ఆకులు గలదీ అగు అపామార్గమా! నిన్ను నాచుట్టూ తిప్పుతున్నాను. మళ్ళీ మళ్ళీ తిప్పడం వల్ల నువ్వు నాపాపాన్ని హరించు అని చెప్తూ చేయాలి.

ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే దక్షిణానికి నిర్భయంగా తిరిగి యమునికి మూడు సార్లు నమస్కరించమని పెద్దలు చెప్తారు. తరవాత నిత్యవిధులైన సంధ్యాదులు అయ్యింతరవాత యమధర్మరాజుగారికి నమస్కరిస్తూ క్రింది శ్లోకం చెప్పి మూడు మార్లు తర్పణం ఇవ్వాలి

యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయచ
వైవస్వతాయ కాలాయ  సర్వభూత క్షయాయచ!
ఔదుంబరాయ  ధర్మాయ నీలాయ పరమేష్ఠినే
మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!!
యమం తర్పయామి! యమం తర్పయామి !యమం తర్పయామి !
(అని నువ్వులతో మూడు మార్లు తర్పణలు వదలాలి.)

యమధర్మరాజుగార్కి పితృత్వం దైవత్వం రెండూ ఉన్నాయి దక్షిణాభిముఖంగా నిర్భయంగా తిరిగి ప్రాచీనావీతిగానూ, నివీతిగానూ తర్పణం ఇవ్వవచ్చు. తల్లి దండ్రులున్నవారు మాత్రం నివీతిగానే చేయాలి అని పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి వాక్కు.

మాషపత్రస్య శాకేన భుక్త్వాతత్ర దినే నరః
ప్రేతాఖ్యాయాంచతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే.

ఈనాడు తప్పకుండా మినప ఆకు కూర తినాలి. (మినపాకు ఎక్కడ దొరుకుతుందీ అన్న సందేహం వద్దు, మినుములు నానేసుకొంటే మొలకలొస్తాయిగా (అదే స్ప్రౌట్స్) వాటినే కొద్దిగా కూర లాగ చేసుకుని తినవచ్చు .. )

సాయంకాలం ఇళ్ళలోనూ, గుళ్ళలోనూ అన్ని ప్రదేశాలలోనూ దీపాలు పెట్టాలి. నువ్వులనూనెతో పెట్టమని శాస్త్రం. దీపదానం చేయటం కూడా కద్దు. ఇక్కడ్నుంచి కార్తీక మాసమంతా దీపదానం, దీపతోరణాలు, ఆకాశ దీపోత్సవాలే.

దీపావళి సాయంత్రం దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకి మార్గం చూపడానికి మగపిల్లలు దివిటీలను (ఉల్కాదానం) చూపాలి,  తరవాత కాళ్ళూ చేతులూ కడుక్కుని ఏదైనా మధుర పదార్థం తినాలి. దివిటీలను గోగు కర్ర, చెఱకు గడ, బొబ్బాస ఆకు, ఆముదం ఆకు, గోంగూర చెట్టు వంటి వాటికి కట్టి వెలిగిస్తారు.

ముఖ్యంగా దీపావళి లక్ష్మీ పూజకి ప్రసిద్ధి ముందురోజైన నరక చతుర్దశి నుండి బలి పాడ్యమి వరకు బలి చక్రవర్తి భూమిమీదకు వచ్చి తన అధికారం చేసేటట్లు, రోజుల్లో లక్ష్మీ పూజ చేసేవారి ఇంట లక్ష్మి సుస్థిర నివాసం ఏర్పరచుకునేటట్లు వరం కోరుకున్నాడు కాబట్టి మూడు రోజులు లక్ష్మీ పూజతో పాటు భగవత్సంకీర్తనం జాగరణం చేసే ఆచారం ఉంది.

దీపావళినాడు దీపంలోనే లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజించాలి. అలక్ష్మిని పంపేయటానికి ఢక్కాలు వాయించడం, దివిటీలు వెలిగించడం, టపాసులు పేల్చి చప్పుడు చేయడం, ఆచారమైంది. ఇంతకు ముందు ఋతువులో పుట్టిన క్రిమి కీటకాదులు దేవతాహ్వానం చేయబడిన దీపాదులు బాణాసంచాదులలో పడి జన్మ నుండి విముక్తిని పొందుతాయి ఉత్తరజన్మలకు వెళతాయి. అంతే కాని లేని పోని ఆడంబరాలు లేక వాతావరణ కాలుష్యం కోసం కాదు. ఇంత గొప్ప సాంప్రదాయం మనది.

జ్ఞాత్వా కర్మాణి కుర్వీత -  తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్య కార్యానికి ఫలం ఉంటుంది, తెలిసి చేస్తే మరింత జాగురూకతతో చక్కగా చేయవచ్చు అని పరమాచార్య ఉద్భోధ.


మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ