A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Saturday, August 24, 2013

ప్రదక్షిణము చేస్తాము - ఎందుకు?

9.  ప్రదక్షిణము చేస్తాము - ఎందుకు?

మనము దేవాలయాన్ని దర్శించినప్పుడు ప్రార్ధన, పూజ అనంతరము గర్భాలయము చుట్టూ కుడి చేతి వేపుగా తిరగడమే ప్రదక్షిణ.
ప్రదక్షిణము ఎందుకు చేస్తాము?
ఒక కేంద్ర బిందువు లేనిదే మనము ఒక వృత్తాన్ని చిత్రీకరించలేము.  భగవంతుడు మన జీవితాలకు కేంద్రము, ఆధారము మరియు సారము.  మనము ఆయనను కేంద్రముగా చేసికొని మన జీవిత కార్య కలాపాలు సాగిస్తాము.  ఈ ప్రాముఖ్యతను తెలిపేదే ప్రదక్షిణము.

ఒక వృత్తానికి దాని పరిధి లోని ప్రతి బిందువు కేంద్ర స్థానము నుంచీ సమానమైన దూరంలోనే ఉంటుంది.  అనగా మనమెక్కడ ఉన్నప్పటికీ, ఎవరమయినప్పటికీ, భగవంతునికి అందరమూ సమానమైన సన్నిహితులమే.  పక్షపాత రహితముగా ఆయన కరుణ అందరి వైపు ఒకేలాగా ప్రవహిస్తూ ఉంటుంది. 

ప్రదక్షిణ ఎడమ నుండి కుడికి గుండ్రగానే ఎందుకు చేయబడుతుంది?
ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడు మనకు కుడివైపు ఉంటాడు.  అందుకని కుడి వైపు నుంచి ప్రదక్షిణము చేస్తాము.  భారత దేశములో కుడి వైపు అనేది శుభ ప్రదత ను తెలుపుతుంది.  ఆంగ్ల భాషలో కూడా సరైన, సరికాని అని చెప్పడానికి రైట్ సైడ్ / రాంగ్ సైడ్ అనే పదాలు వాడతారు.  అందువలన గర్భాలయంను కుడి వైపుగా ఉంచి ప్రదక్షిణము చేసేటప్పుడు మనకు అన్ని వేళలా సహాయము, శక్తిని ఇచ్చి, మార్గ దర్శకత్వము అయి మన జీవితాన్ని ధర్మము  వైపు నడిపించే వాడయిన భగవంతునితో బాటు ఋజు వర్తనము కలిగి శుభప్రదమైన జీవితాన్ని గడపాలని గుర్తు చేసికోవాలి. 
మనము అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే వాటిని కుడి వైపున అంత కన్నా తక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చే వాటిని వెడమ వైపున ఉంచడము మన సాంప్రదాయం.   ఈ విధముగా చేయడము వలన అధర్మ ప్రవృత్తుల నుంచి బయట పడి మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా సవ్య మార్గములో నిలబడతాము. 

భారతీయ వేద గ్రంధాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిధి దేవో భవ అని శాసిస్తాయి.  నువ్వు నీ తల్లిదండ్రులను మరియు గురువులని భగవత్స్వరూపులుగా భావించుదువు గాక!  ఈ భావముతో మనము మన తల్లి దండ్రులకు మరియు మహాత్ములకి కూడా ప్రదక్షిణ చేస్తాము.  తన తల్లి దండ్రులకి గణపతి దేవుడు ప్రదక్షిణ చేసినట్లు చెప్పే కధ అందరికీ తెలిసినదే.

సంప్రదాయ పద్దతి ప్రకారము పూజ పూర్తి చేసిన తరువాత మనము విధిగా ఆత్మ ప్రదక్షిణ చేస్తాము.  ఈ విధముగా చేయడము వలన బాహ్యముగా విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడే మనలో ఉన్న విశిష్టమైన దివ్యత్వముగా గుర్తిస్తాము.  మనము ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది విధంగా స్తుతిస్తాము.

యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే 
ఎన్నో జన్మలుగా చేయబడిన పాపాలన్నీ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగులోనూ నశింపబడు గాక!

ఆహారము తీసికొనే ముందర భగవంతునికి నివేదిస్తాము ఎందుకు?

8. ఆహారము తీసికొనే ముందర భగవంతునికి నివేదిస్తాము ఎందుకు?

పాశ్చాత్య సాంప్రదాయములో క్రుతజ్ఞతా పరమైన ప్రార్ధన తరువాత తీసికోబడుతుంది.  భారతీయులు దానిని భగవంతునికి నివేదన చేసిన తరువాత 'ప్రసాదం' గా స్వీకరిస్తారు.  దేవాలయాలలో మరియు అనేకుల గృహాల్లోను ప్రతిరోజూ వండిన పరార్ధాలు ముందుగా భగవంతునికి నివేదిన్చబడతాయి.  ఆ నివేదింపబడిన పదార్ధము మిగతా పదార్ధాలతో కలిపి ప్రసాదంగా వడ్డించ బడుతుంది.  మన నిత్య పూజా కార్యక్రమంలో కూడా మనము భగవంతునికి 'నైవేద్యము' సమర్పిస్తాము.

మనము నైవేద్యము ఎందుకు సమర్పిస్తాము
భగవంతుడు సర్వ శక్తి వంతుడు మరియు సర్వజ్ఞుడు.  భగవంతుడు పూర్ణుడయి ఉండగా మానవుడు అందులో అంశ మాత్రమె.  మనము ఏ పనైనా భగవంతుడిచ్చిన శక్తి, జ్ఞానము వలన మాత్రమే చేయగలుగుతున్నాము.  కావున జీవితములో మనం చేసే కర్మల ఫలితంగా మనము పొందేదంతా నిజానికి ఆయనదే.  ఈ విషయము గ్రహించి ఆహారాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పిస్తాము.   భగవంతునికి అర్పించిన తర్వాత అది ఆయన దివ్య స్పర్శ నొంది అనుగ్రహంతో మనకిచ్చిన కానుకగా మనచే స్వీకరించ బడుతుంది.

ఈ విషయం తెలిసికొన్న తరువాత ఆహారం పట్ల, ఆహారం తినే విదానంపట్ల మన వైఖరి పూర్తిగా మారుతుంది.  సాధారణంగా నివేదిమ్పబడిన ఆహారము పవిత్రంగాను, ఉత్తమమైనది గాను ఉంటుంది.   మనము దానిని స్వీకరించే ముందర ఇతరులతో పంచుకొంటాము.  మనము ఆహారాన్ని అధికార పూర్వకముగా అడగకూడదు.  అసంతృప్తి పడకూడదు లేక మనకు లభించిన ఆహారపు నాణ్యత గురించి విమర్శించ కూడదు.  మనము దానిని సంతోషముగా ప్రసాద బుద్ధితో స్వీకరించాలి.  ఈ విధముగా ప్రసాద భావన పెంపొందింప చేసుకొంటే కేవలము ఆహారము పట్లనే కాక మన జీవితములో లభించే అన్నింటిని కూడా ప్రసాదంగా సంతోషముగా స్వీకరించగలము.

ప్రతిరోజు భోజనాన్ని ముందర పవిత్రము చేసే చర్యగా కంచం చుట్టూ నీరు చల్లుతాము.  కంచం ప్రక్కగా ఐదు ముద్దలను మనచేత చెల్లించబడే రుణాలకి ప్రతీకగా ఉంచుతాము.
1) దేవ ఋణం  ..  దేవతల దయార్ద్ర అనుగ్రహము మరియు రక్షణలకు.
2) పిత్రు ఋణం  ..  పితృ దేవతలకి  వంశ పారంపర్యత్వాన్ని మరియు సంస్కృతిని ఇచ్చినందుకు.
3) భూత ఋణం ..   ఎవరి ఆలంబన లేనిదే ఈ సంఘములో మనము జీవిన్చాలేమో ఆ సంఘాన్ని ఏర్పరిచిన వారు.
4)  రుషి ఋణం  ..  మన మతమును మరియు సంస్కృతిని గుర్తింపచేసి, వృద్ధి పరచి, తద్వారా మనకందించినందుకు
5)  మనుష్య ఋణం  ..  ఇతర ప్రాణులు స్వలాభాపేక్ష లేకుండా మనల్ని సేవిస్తున్నందుకు

ఆ తర్వాత పంచ ప్రాణాలుగా శరీరాన్ని నిలబెట్టే ప్రాణ శక్తిగా మనలో ఉన్న భగవంతుడికి ప్రాణాయా స్వాహా; అపానాయ స్వాహా; వ్యానాయ స్వాహా; ఉదానాయ స్వాహా; సమానాయ స్వాహా అని చెపుతూ నివేదించ బడుతుంది.  పంచ ప్రాణాలు ఈ క్రింది విధముగా శారీరక విధులు నిర్వహిస్తాయి.

1) ప్రాణము ... శ్వాస కొశమును చైతన్య వంతము గావిస్తుంది.
2) వ్యానము ... నాడీ వ్యవస్థను నియంత్రింప చేస్తుంది
3) అపానము ... వ్యర్ధ పరార్ధాలను బయటకు త్రోస్తుంది.
4) సమానము ... జీర్ణ క్రియను చైతన్య వంతము చేసి శరీరానికంతటికి శక్తి సరఫరా చేస్తుంది.
5) ఉదానము  ... ఎక్కిళ్ళు మొదలగునవి కల్గించేది, ఆలోచనా శక్తి నిచ్చేది.  పై విధంగా నివేదించబడిన తరువాత ఆహారం ప్రసాదంగా తీసికోబడుతుంది.  ఈ భావన గుర్తు చేసి కోవడానికి భగవద్గీత లోని ఈ శ్లోకాలను చదువుతారు.

బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా
కర్మనే బ్రహ్మమని స్థిరంగా భావించి బ్రహ్మమనే  హవిస్సు బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మముచేత హోమం చేయబడేది బ్రహ్మమే.  దానిద్వారా అందుకోవలసిన గమ్యం కూడా బ్రహ్మమే.

అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం
నేను వైశ్వానరుడినై ప్రాణుల దేహాలను ఆశ్రయించి ప్రాణాపానములతో కూడికొని చతుర్విధ అన్నాన్ని పచనము చేస్తున్నాను

విభూతిని ఎందుకు పెట్టుకొంటాము?

7. విభూతిని ఎందుకు పెట్టుకొంటాము?
 
నెయ్యి మరియు ఇతర వనమూలికలతో కలిపి ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి హోమంలో ఆహూతిగా సమర్పించినపుడు అందులోనుంచి వచ్చిన భస్మమే విభూతి.  లేదా విగ్రహానికి భస్మముతో అభిషేకము చేసిన దానిని విభూతిగా పరిగణిస్తారు.   అంతే కానీ కాలిన ప్రతి వస్తువు యొక్క బూడిద విభూతిగా పరిగనించబడదు.

విభూతిని సాధారణంగా నుదిటి మీద పెట్టుకొంటారు.  కొందరు దానిని భుజాలు చాతీ మొదలైన ఇతర శరీర భాగాల మీద కూడా పెట్టుకుంటారు.  కొందరు, ఆస్తికులు శరీరానికి అంతటికీ దీనిని రుద్దుకొంటారు.  చాలా మంది భస్మాన్ని స్వీకరించినప్పుడల్లా చిటికెడు నోట్లో వేసికొంటారు.

విభూతిని ఎందుకు ధరించాలి?
భస్మము అనే మాటకు "మన పాపాలను భస్మము చేసేది, భగవంతుడిని జ్ఞాపకము చేసేది" అని అర్ధము.  "భ" అంటే భస్మము చేయడాన్ని; "స్మ" స్మరణమును సూచిస్తున్నాయి.  అందువలన భస్మధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి, దివ్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది.  భస్మము .. ధరించిన వారికి శోభనిస్తుంది గనుక "విభూతి" (శోభ) అనీ, దానిని పెట్టుకున్న వారిని పరిశుద్ద పరచి వారిని అనారోగ్యత, దుష్టతలనుండీ రక్షిస్తుంది గనుక రక్ష అని అంటాము. 
హోమము (పవిత్రమైన మంత్రాలతో అగ్ని దేవుడికి సమర్పించే నివేదన) అహంకారము స్వార్ధ కామనలను జ్ఞానమనే అగ్నికి లేదా ఒక ఉన్నత నిస్స్వార్ధ కారణార్ధముకు ఆహుతిగా సమర్పించడానిని సూచిస్తుంది.  తద్వారా వచ్చే భస్మము అటువంటి పనులు ఫలితంగా వచ్చే మానసిక పరిశుద్దతను సూచిస్తుంది.  నివేదనలను, సమిధలను అగ్నిలో దహింపజేయడమనేది జ్ఞానమనే అగ్నిలో అజ్ఞానము, సోమరి తనాన్ని వదిలించు కోవడాన్ని సూచిస్తుంది.  మనము ధరించే భస్మము, ఈ శరీరములో నున్న అసత్యపు తాదాత్మ్యత మరియు జనన మరణాల పరిమితుల నుంచి విడివడి స్వతంత్రుల మవ్వాలని సూచిస్తుంది.  శరీరము నశించేదని, ఒకనాడది బూడిదగా అవుతుందని కూడా మనకు భస్మ ధారణ గుర్తు చేస్తుంది.  అందువలన మనము దేహముపై మితిమీరిన మమకారం కలిగి ఉండకూడదు.  మరణమనేది ఏ క్షణానైనా రావచ్చు.  ఈ గ్రహింపు జీవితాన్ని ఉత్తమోత్తమముగా వినియోగించుకొని అభివృద్ధి మార్గాన పయనించే లాగున చేస్తుంది.  అంతేకాని మరణాన్ని గురించి జ్ఞాపకము చేసే దుఃఖ భరితమైనదని అపార్ధము చేసికో కూడదు.  కాలము ఎవరి కోసం నిలబడదని తెలియజేసే శక్తివంతమైన సూచిక ఈ భస్మము.

శరీరమంతటా భస్మాన్ని రాసుకోనేటటువంటి పరమ శివునితో ఈ భస్మము ప్రత్యేకమైన సంబంధము కలిగి ఉంది.  శివ భక్తులు భస్మాన్ని త్రిపుండ్రాకారంలో ధరిస్తారు.  మధ్యలో ఎర్రని బొట్టుతో కలిపి పెట్టుకున్నప్పుడు ఆ గుర్తు శివ శక్తులను సూచిస్తుంది.

కట్టెలన్నీ(పదార్ధాలు) కాలిపోయిన తరువాత మిగిలేది బూడిద.  దానికి నాశనము లేదు.  అదే విధముగా లెక్కలేనన్ని నామ రూపాలతో కూడిన సృష్టి అంతా నశించినప్పుడు మిగిలి ఉండేది, నాశనము లేనటువంటి శాశ్వత సత్యము ఐన భగవంతుడు మాత్రమె. 

"భస్మము" ఔషధగుణాలని కలిగి ఉంది.  ఇది ఎన్నో ఆయుర్వేద మందులలో వాడ బడుతుంది.  ఇది శరీరములోని అధిక శీతలతను పీల్చుకొంటుంది.  జలుబు, తలనొప్పులు రాకుండా కాపాడుతుంది .  భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రము చెప్పాలని ఉపనిషత్తులు చెపుతున్నాయి

త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మ్రుత్యోర్ముక్షీయ మామృతాత్
మనల్ని పోషించేటటువంటి, మన జీవితాలలో పరిమళాలను వ్యాపింప చేసేటటువంటి త్రినేత్రధారుడైన శివుడిని పూజిద్దాము.  అతడు మనల్ని దుఃఖము మరియు మరణాల సంకెళ్ళనుండి పండిన దోసకాయ తోడిమ నుండి విడిపోయే టంత సులభంగా విడిపించును గాక.

కాగితాలను పుస్తకాలను, మనుషులను కాళ్ళతో తగలకూడదు ఎందుకు?

6. కాగితాలను పుస్తకాలను, మనుషులను కాళ్ళతో తగలకూడదు ఎందుకు?


హిందువుల ఇళ్ళల్లో, చిన్నప్పటినుంచీ కాగితాలకి, పుస్తకాలకి మరియు మనుషులకి కాళ్ళను తగలనివ్వ  కూడదని నేర్పించబడుతుంది.  ఒకవేళ పొరబాటున కాగితాలకి, పుస్తకాలకి, సంగీత సాధనాలకి లేదా ఏ ఇతరమైన విద్యా సంబంధమైన వస్తువులకి కాలు తగిలితే క్షమాపణకి గుర్తుగా కాలు తగిలిన వస్తువుని గౌరవపూర్వకముగా చేతితో తాకి కళ్ళకద్దుకోవాలని పిల్లలకు నేర్పబడుతుంది.

కాగితాలకు, మనుషులకు కాళ్ళు ఎందుకు తగలరాదు?
భారతీయులకు జ్ఞానము పవిత్రము, దివ్యము ఐనది.  అందువలననే దానికి ఎల్లవేళలా గౌరవమివ్వాలి.  ఈ రోజుల్లో పాఠ్యంశములను ఆధ్యాత్మికము ఐహికము అని విడదీస్తున్నాము.  కానీ ప్రాచీన భారతదేశములో ప్రతి విషయము శాస్త్ర సంబంధమైన లేక ఆధ్యాత్మ సంబంధమైనది అయినా సరే పవిత్రంగా పరిగణించి గురువుల చేత గురుకులాల్లో నేర్పించబడేది.

చదువుకి సంబంధించిన వస్తువులని తొక్క కూడదనే ఆచారము భారతీయ సంస్కృతి విద్యకు ఇచ్చే ఉన్నత స్థానాన్ని తరచూ గుర్తు చేస్తుంది.  చిన్న తనమునుంచే ఈ విధముగా నేర్పడము వలన మనలో పుస్తకాల పట్ల, విద్య పట్ల శ్రద్దాభక్తులు నాటుకు పోతాయి.   జ్ఞానాధి దేవతకు అర్పణగా సంవత్సరానికి ఒకసారి సరస్వతీ పూజ లేదా ఆయుధపూజ రోజున మనము పుస్తకాలని వాహనాలని మరియు పనిముట్లని పూజించడానికి కూడా ఇది ఒక కారణము.  మనము చదువుకునే ముందు ఈ క్రింది విధంగా ప్రార్థిస్తాము .......

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా

వరాలనిచ్చి, కోరికలని తీర్చే ఓ సరస్వతీ దేవీ! నా చదువును ఆరంభించే ముందర నీకు నమస్కారము చేస్తున్నాను.  నీవు ఎల్లప్పుడూ నా కోరికలు తీర్చుదువు గాక!

పిల్లలు పొరపాటున ఎవరికయినా కాళ్ళు తగిలినప్పుడు చాల భయపడతారు.  ఒకవేళ పొరపాటున తగిలితే క్షమాపణకై మనము ఆ వ్యక్తిని చేతితో తాకి వేళ్ళను కళ్ళకు అద్దుకోవాలి.  పెద్దవాళ్ళయినా చిన్నవాళ్ళని అజాగ్రత్తతో కాళ్ళతో తగిలితే, వారు వెంటనే క్షమాపణ చెప్తారు.

ఇతరులకి కాళ్ళు తాకడము చెడునడవడిగా పరిగణింప బడుతుంది - ఎందుకు?మానవుడు ఈ భూమి మీద ప్రాణముతో, భగవంతుని యొక్క చక్కటి ఆలయముగా పరిగణింప  బడుతాడు.  అందువల్ల ఇతరులను పాదాలతో తాకడము అంటే వారిలో నున్న దివ్యత్వాన్ని అగౌరపరచడం వంటిదే.   అందుకే పొరపాటున తగిలినా కూడా వెంటనే భక్తీ, వినయములతో కూడిన క్షమాపణను చెప్పాలి.

పై విధముగా మన ఆచారములు చాల సరళమైనవి.  కానీ అవి చాలా శక్తివంతమైన పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సత్యాలను గుర్తుకు తెస్తాయి.  ఇటువంటి ఆచారాలు శతాబ్దాలనుండి భారతీయ సంస్కృతిని సజీవముగా నిలబెట్టడానికి కారణమయ్యాయి.

నుదిటి పైన బొట్టు ఎందుకు?

5. నుదుట బొట్టు పెట్టుకొంటాము. ఎందుకు?
 
దైవభక్తి గల భారతీయులు ప్రత్యేకించి వివాహితులు ఐన స్త్రీలు నుదిటి మీద తిలకము లేదా బొట్టు పెట్టుకొంటారు.  ప్రతి రోజు స్నానము చేసిన తరువాత మరియు ప్రత్యేక సందర్భాలలోనూ, పూజ చేసే ముందర,  తరువాత,  లేక దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు తప్పక బొట్టు పెట్టుకుంటారు.  చాలా తెగలలో వివాహితులైన స్త్రీలు ఎల్లా వేళలా నుదుట కుంకుమ పెట్టుకొనే కనిపించాలనే ఆదేశము ఉంది.   వైదిక పద్దతులను ఆచరించే వారు మంత్ర ప్రార్ధనలతో కుంకుమ ధరిస్తారు.  మహాత్ములకు మరియు దైవ ప్రతిమలకు ఆరాధనా సూచకంగా బొట్టు / తిలకం ధారణ జరుపుతాము.  తిలకము వేరు వేరు రంగులలోను, రూపాలలోను ఉంటుంది.

నుదిటి పైన బొట్టు ఎందుకు?
నుదుటి  పైన బొట్టు - ధరించిన వారిలోనూ, ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది.  దైవ చిహ్నము గా గుర్తించ బడుతుంది. 

మునుపటి  కాలములో బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరు వేరు చిహ్నాలను ధరించేవారు.  పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణుడు తన స్వభావమైన పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవాడు.  క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియుడు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదుట ధరించే వాడు.  వర్తక వాణిజ్యాల ద్వారా సంపదను పెంపొందించే వైశ్యుడు అభ్యుదయానికి అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవాడు.   శూద్రుడు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించెవాడు.

విష్ణు ఉపాసకులు U ఆకారముగా చందన తిలకాన్నీ, శైవ ఉపాసకులు భస్మ త్రిపున్డ్రాన్నీ, దేవీ భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవారు.

భగవంతునికి సమర్పించిన చందనము, కుంకుమ, భస్మము ప్రసాదముగా స్వీకరించబడిన తరువాత మన నుదుట పెట్టబడుతుంది.   జ్ఞాపక శక్తికి మరియు ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య నున్న ప్రదేశములో తిలకము పెడతాము.  యోగ పరిభాషలో ఈ ప్రదేశము ఆజ్ఞా చక్రముగా చెప్పబడుతుంది.  నేను భగవంతుని గుర్తున్చుకొండును గాక! ఈ భక్తీ భావన నా అన్ని కార్య కలాపాలలోనూ వ్యాపించుగాక! నేను నా అన్ని వ్యవహారాలలో ధర్మబద్ధముగా ఉందును గాక! అనే ప్రార్ధనతో తిలకము పెట్టుకోబడుతుంది.  మనము ఈ ప్రార్ధనాయుతమైన వైఖరిని తాత్కాలికముగా మరచిపోయినా, ఇతరుల నుదుటి పైనున్న బొట్టు మనకు వెంటనే మన ప్రార్ధనను గుర్తుకు చేస్తుంది.   అందుకే ఈ తిలకము మనకు భగవంతుని ఆశీర్వాదము మరియు అధర్మ ప్రవ్రుత్తులనుంచి, వ్యతిరేక శక్తుల నుండి రక్షణ వంటిది.

మన శరీరము మొత్తము ప్రత్యేకించి నుదురు కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము  విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది.  అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది.  తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది.  శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది.  కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది.  బొట్టుకు బదులుగా వాడే ప్లాస్టిక్ బిందీ లు అలంకార ప్రాయమే కానీ నిజమైన ప్రయోజనాన్ని కలిగించవు.

భారతీయులకు ఈ ఆచారము చాలా అపూర్వమైనది.   మరియు ఎక్కడ ఉన్నా సులభంగా మనల్ని గుర్తించడానికి సహాయపడుతుంది.

తల్లిదండ్రులకు, పెద్దలకు సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?

4. తల్లిదండ్రులకు, పెద్దలకు సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?
 
భారతీయులు తమ తల్లిదండ్రులకు, పెద్దలకు, గురువులకు, మహాత్ములకు సాష్టాంగ నమస్కారము చేస్తారు.  మనచే నమస్కరింపబడిన పెద్దలు తిరిగి వారి చేయిని మన తలమీద లేక పైన ఉంచి దీవిస్తారు.  ప్రతి రోజు పెద్దలను కలిసినప్పుడు మరియు ఏదైనా క్రొత్తగా ప్రారంభించేటప్పుడు, జన్మదినములు పండుగలు మొదలగు శుభ సందర్భాలలో కూడా పెద్దలకు నమస్కరించడము జరుగుతుంది.  కొన్ని సంప్రదాయ సమూహాలలో తమ కుటుంబము, సామాజిక హోదా మరియు తమ పరిచయము తెలియచేసే విధముగా (ప్రవర తో కూడి) సాష్టాంగ నమస్కారము చేయబడుతుంది.


సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?
మానవుడు తన పాదాల ఆధారముగా నిలబడతాడు.  సాష్టాంగ నమస్కారములో పెద్దల పాదాలకు నమస్కరించడమనేది వారి వ్యక్తిత్వానికి ఆధారమైన పెద్దరికానికి, పూర్ణత్వానికి, ఉదారతకు, దివ్యత్వానికి మనము ఇచ్చేటటువంటి గౌరవానికి చిహ్నము.  ఇది వారికి మనపై గల స్వార్ధరహిత ప్రేమ మరియు మన సంక్షేమానికి వారు చేసిన త్యాగాల పట్ల మన కృతజ్ఞతని తెలియజేస్తుంది.  ఇది ఇతరుల గొప్పతనాన్ని అణకువతో అంగీకరించే ఒక మార్గము.  భారతదేశము యొక్క గొప్ప శక్తులలో ఒకటైన పటిష్టమైన కుటుంబ బాంధవ్య వ్యవస్థను ప్రతిబింబింప జేసే ఆచారములలో ఇది ఒకటి.

భారత దేశములో పెద్దల శుభ సంకల్పాలకు మరియు అశీర్వాదములకు ఉన్నతమైన విలువ ఇవ్వబడుతుంది.  వాటిని పొందడానికి మనము నమస్కరిస్తాము.  మంచి ఆలోచనలు మంచి తరంగాలను సృష్టిస్తాయి.  పరిపూర్ణమైన ప్రేమ, దివ్యత్వము మరియు ఉదారత్వముతో నిండిన హ్రుదయాలనుండి  ఉద్భవించే శుభకామనలు అద్భుతమైన శక్తిని కల్గి ఉంటాయి. ఎప్పుడైతే మనము వినయముతో గౌరవముతో పెద్దలకు నమస్కరిస్తామో అప్పుడు వారి శుభకామనలు, దీవెనలు మంచి శక్తి వంతమైన తరంగ రూపంలో మనపై ప్రసరిస్తాయి.  ఇందు వలననే మనము నిలబడి కానీ, సాగిలబడి కానీ నమస్కారము చేసినప్పుడు శరీరమంతా ఈ శక్తిని స్వీకరించ గలుగుతుంది.


గౌరవాన్ని తెలియపరచే వివిధ రీతులు:
ప్రతుత్థానము   :  లేచి నిలబడి స్వాగతమిచ్చుట
నమస్కారము : నమస్తే అని విధేయతను వ్యక్త పరచడము
ఉపసంగ్రహణ   : పెద్దల, గురువుల పాదాలను తాకడము
సాష్టాంగము   : కాళ్ళు, మోకాళ్ళు, ఉదరము, చాతి, నుదురు చేతులు అన్నీ నేలను తాకేలాగా పెద్దల ముందు సాగిలబడి నమస్కరించుట
ప్రత్యభివందనము: ప్రతి నమస్కారము చేయుట.


సంపద, వంశము, వయస్సు, నైతిక బలము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము ఒకదాని కంటే ఒకటి ఎక్కువ గా వ్యక్తులకు గౌరవాన్ని పొందే అర్హతను కల్గిస్తాయి.  ఇందువలననే భూమిని పరిపాలించే రాజు ఐనప్పటికీ ఆధ్యాత్మిక గురువు యొక్క పాదాలకు నమస్కరిస్తాడు.  ఈ భావాన్ని ప్రత్యేకంగా స్పష్టము చేసే కధలెన్నో మనకు రామాయణం, మహా భారతము వంటి ఇతిహాసాలలో గలవు.

ఈ సంప్రదాయము వలన కుటుంబము మరియు సంఘము లోని వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమ, గౌరవము, ఐకమత్యం, శాంతియుత వాతావరణము పెంపొందించ బడుతున్నాయి.

నమస్తే ఎందుకు చేయాలి?

3. 'నమస్తే' ఎందుకు చెప్పాలి?

భారతీయులు ఒకరినొకరు 'నమస్తే' అని పలకరించు కుంటారు.  నమస్తే అన్నప్పుడు తల వంచి రెండు అరచేతులు హృదయం ముందర కలపడము జరుగుతుంది.  మనకన్నా చిన్నవారైనా, సమ వయస్కులైనా, పెద్దవారైనా స్నేహితులైనా మరియు కొత్తవారైనా కూడా ఇదే విధముగా నమస్తే అని పలకరించాలి.

శాస్త్రాలలో సంప్రదాయ బద్ధమైన ఐదు రకాల అభివందనములు ఉన్నాయి.  అందులో నమస్కారము ఒకటి.  నమస్కారము అంటే సాగిలపడుట అనే అర్ధము వస్తుంది.  కానీ నమస్తే అంటే ఈ రోజుల్లో మనము ఒకరిని ఒకరు కలిసినప్పుడు ఇచ్చి పుచ్చుకునే మర్యాదగా గ్రహించాలి.

నమస్తే ఎందుకు చేయాలి?
నమస్తే అనేటటువంటిది మామూలుగా అలవాటుగా చేసేటటువంటి వందనమో, సంప్రదాయబద్ధమైన ఆచారమో లేక భగవదారాధనో అయి ఉండవచ్చును.  ఏది ఏమైనప్పటికీ ఈ ఆచారములో మనకు తెలియని చాలా లోతైన అర్ధము ఉంది .  సంస్కృతములో నమః+తే = నమస్తే.  దీని అర్ధము - నేను నీకు నమస్కరిస్తున్నాను అని.   నమః అనే  పదాన్ని "న", "మః" గా విడదీయవచ్చు - నాది కాదు అనే అర్ధము వస్తుంది.  ఇతరుల సన్నిధిలో మన అహంకారాన్ని వదిలించుకొనే లేక తగ్గించుకొనే ఆధ్యాత్మిక సాధనను తెలియ జేసే ఆచారమిది.

వ్యక్తుల మధ్య నిజమైన కలయిక అంటే వారి మనస్సులు కలవడమే.  అందుకే మనము ఇతరులను కలిసినప్పుడు నమస్తే అంటాము.  అనగా 'మన మనసులు కలియుగాక' అని అర్ధము.  హృదయం ముందర రెండు అరచేతులు కలపడము ఈ అర్థాన్నే సూచిస్తుంది.  తల వంచడము అనేది ప్రేమతో వినయముగా మర్యాదని, స్నేహాన్ని అందించడాన్ని తెలియచేస్తుంది.
నమస్కారమనేది ఆధ్యాత్మ పరంగా ఇంకా లోతైన అర్ధాన్ని సూచిస్తుంది .  ప్రాణ శక్తి, దివ్యత్వము; ఆత్మ లేక పరమాత్మ అందరిలో ఒకేలాగా ఉన్నది.  ఈ ఏకత్వాన్ని గుర్తించి రెండు చేతులు కలిపి తల వంచి ఇతరులను కలిసినప్పుడు వారిలో ఉన్న దివ్యత్వానికి నమస్కరిస్తాము.  మహాత్ములకు, భగవంతుడికి నమస్కారము చేసేటప్పుడు అందుకనే ఒక్కోసారి మనలోనున్న దివ్యత్వాన్ని చూసుకోవడానికా అన్నట్లు కనులు మూసుకొంటాము.  దివ్యత్వాన్ని సూచించే విధముగా నమస్కారము ఒక్కోసారి  భగవన్నామములతో ద్వారా కూడా చేయ బడుతుంది.  ఈ ప్రాముఖ్యత తెలిసికొన్నప్పుడు నమస్కారము చేసేటప్పుడు పైపైకే నమస్తే అనడము గాక సరైనటువంటి స్నేహానికి దోహదము చేసే లాగున ప్రేమతోను గౌరవముతోను కూడిన వాతావరణాన్ని కలుగ చేయ గలము.

ప్రార్ధనా గదిని ఎందుకు కలిగి ఉండాలి?

2. ప్రార్ధనా గదిని ఎందుకు కలిగి ఉండాలి?
 
భారతీయులందరూ పూజకై, ప్రార్ధనకై ఒక గదిని లేక కొంత స్థలాన్ని తమ గృహములలో కేటాయిస్తారు.  ప్రతి రోజూ దైవానికి ముందు ఒక  దీపాన్ని వెలిగిస్తారు.  జపము, ధ్యానము, పారాయణము, ప్రార్ధనలు, భజనలు మొదలగు ఆధ్యాత్మిక సాధనాలు కూడా ఈ ప్రార్ధనా స్థలమందు జరుపుతారు.  పుట్టిన రోజు, వివాహాది దినములు మరియు పండుగలు మొదలైన అన్ని శుభ సందర్భాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు.  గృహములోని పెద్దలు, పిన్నలు అందరు కూడా దైవముతో సాన్నిధ్యము కలిగి పూజ చేసికొంటారు.
పూజాగది - ఎందుకు?
ఈ చరాచర సృష్టికి పరమాత్మ మాత్రమే సొంత దారుడు.  కావున మనము నివసించే గృహానికి కూడా నిజమైన హక్కుదారు పరమాత్మయే.  పూజా గది అనేది ఆ యజమాని ఐన పరమాత్మ గది.  మనము భగవంతుని సొత్తుకు నిజమైన సొంత దారులము కాము అనే భావన వలన మాత్రమె మన దురహంకారము, మనది అనే పెత్తందారి తనమును వదిలించుకోగలము.

మనము నివసించే గృహమునకు మరియు మనకు కూడా యజమాని భగవంతుడే.  మనము కేవలము ఆయన గృహానికి నియమించబడ్డ నిమిత్త మాత్రులమైన సేవకులము అన్న సరైన భావన కల్గి ఉండటము ఉత్తమము.  ఈ విధముగా భావించ వీలు కానిచో భగవంతుడిని మన గృహానికి విచ్చేసిన ముఖ్య అతిధిగా భావించి ఆయన సంతోషముగా ఉండడానికి పూజ గదిని కానీ, దైవ పీఠమును గాని వసతిగా కల్పించాలి.  అన్ని వేళలా ఆ ప్రదేశం శుభ్రముగా మరియు అలంకార యుక్తంగా ఉండేలా చూడాలి (ఉన్నతాధికారి మన ఇంటికి వస్తుంటే వారికి చేసే సౌకర్యాలకన్నా కొంత ఎక్కువగానే ఉండేలా చూడాలి).

పరమాత్మ సర్వ వ్యాపి .  ఈ విషయము గుర్తుంచు కోవడానికి ఆయన మన ఇంట్లో మనతో ఉండడానికి మనము పూజా గదులను కల్గి ఉండాలి.  భగవంతుని అనుగ్రహము లేనిదే మనము ఎ పనిని విజయవంతముగా చేయలేము, దేనిని సాధించ లేము.  పూజ గదిలో భగవంతుడిని ప్రతి రోజూ ప్రార్ధించటము వలన సన్నిహిత సంబంధము ఏర్పడి ఆయన అనుగ్రహాన్ని త్వరగా పొందగలము.

ఇంటిలోని ప్రతి గది ఒక ప్రత్యేకమైన పనికి నిర్దేశింపబడి ఉంటుంది.   ఆయా గదులు ఆయా నిర్దేశింపబడిన పనులకు అనుకూలము కల్గి ఉండేలాగా అమర్చి ఉంటాయి.  అదే విధముగా ధ్యానానికి, పూజకు, ప్రార్ధనకు కూడా అనుకూలమైన వాతావరణము కల్గినటువంటి పూజాగది మనకు అవసరము . పవిత్రమైన ఆలోచనలు, శబ్దతరంగాలు ఆ ప్రదేశములో వ్యాపించి అక్కడకు వచ్చినవారి మనస్సుల్ని ప్రభావితము చేస్తాయి .  మనము అలసిపోయినప్పుడు లేక కలత చెందినప్పుడు కేవలము ప్రార్ధనా గదిలో కొద్దిసేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే కూడా చాలు ప్రశాంతత, ఉత్సాహము, ఆధ్యాత్మిక ఎదుగుదల పొందగలము.

దీపారాధన ఎందుకు చేయాలి?

1. దీపారాధన ఎందుకు చేయాలి?


ప్రతి భారతీయ గృహములోను దైవపీఠము వద్ద రొజూ దీపాన్ని వెలిగిస్తారు.  కొన్ని ఇళ్ళలొ ఈ దీపాన్ని ఉదయము, మరి కొందరు సాయంత్రం, ఇంకొందరు ఉభయ సంధ్యలలొ వెలిగిస్తారు.  అరుదుగా కొందరు (అఖండ దీపము) ప్రతి దినము రోజంతా ఉండేలాగ దీపాన్ని వెలిగిస్తారు.

శుభ సందర్భాలు, నిత్య పూజలు, ప్రార్ధనలు, పర్వ దినాలు మరియు సామాజిక ప్రారంభోత్సవాలు మొదలైనవి అన్నీ కూడా దీపము వెలిగించిన తర్వాతనే ప్రారంభిస్తారు.  ఒక్కొక్కసారి ఆయా సందర్భాలు పూర్తయ్యేవరకు ఆ దీపాన్ని అలాగే కొనసాగిస్తారు.

అట్లా ఎందుకు చెయ్యాలి?
కాంతి జ్ఞానానికి, చీకటి అజ్ఞానానికి చిహ్నములు.  భగవంతుడు జ్ఞానస్వరూపుడు.  అన్ని విధములైన జ్ఞానానికీ ఆయనే ఆధారము.  జ్ఞానాన్ని ఇచ్చేవాడు, పోషించే వాడు కనుక జ్యోతి రూపములో భగవంతుడిని ఆరాధిస్తాము.
కాంతి చీకటిని తొలగించినట్లుగా జ్ఞానము అజ్ఞానాన్ని తొలగిస్తుంది.  జ్ఞానమనేది ఎప్పటికీ తరగని అంతరంగ సంపద.  అన్ని సంపదలకన్నా గొప్ప సంపదగా జ్ఞానాన్ని భావించి దీపాన్ని వెలిగించి నమస్కరిస్తాము.  మనము చేసే పనులు మంచివైనా, చెడ్డవైనా జ్ఞానాన్ని ఆధారముగా చేసికొనే చేస్తాము.  అందువలననే అన్ని శుభ సందర్భాలలో మన ఆలోచనలకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము.
బల్బును కానీ ట్యూబ్ లైట్ను గానీ ఎందుకు వెలిగించరు? అది కూడా చీకట్లను తొలగిస్తుంది కదా!
కానీ సాంప్రదాయ దీప కాంతి మనకు ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది.  దీపానికి వాడే నెయ్యి లేక తైలము మనలోని వాసనలు లేక స్వార్ధ పూరితమైన సంస్కారాలకు చిహ్నము. వత్తి అహంకారానికి ప్రతీక.  ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానముతో వెలిగిస్తామో అప్పుడు వాసనలు మెల్లగా కరిగి పోయి అహంకారం అంతరించిపోతుంది.  
జ్యోతి ఎప్పుడూ పై వైపుకు మాత్రమే చూస్తూ ఉంటుంది.  అదే విధముగా మనము ఆర్జించే జ్ఞానము మనల్ని ఎప్పుడూ ఉన్నత ఆశయాల వైపు మళ్ళిస్తుంది.
ఒక దీపము కొన్ని వందల దీపాలను వెలిగిస్తుంది.  అదే విధముగా ఒక జ్ఞాని తన జ్ఞానాన్ని ఎంతో మందికి అందిస్తాడు.  దీపాలను వెలిగించడము వలన వెలిగించే దీపము యొక్క కాంతి ఏమాత్రము తగ్గి పోదు.   అదే విధముగా జ్ఞాని జ్ఞానాన్ని ఇతరులకి పంచడము వలన తన జ్ఞానము తగ్గదు.  పైపెచ్చు జ్ఞానము గురించిన అవగాహన పెంపొందుతుంది.  ఇచ్చిన వాళ్లకు, తీసికొనే వాళ్లకు కూడా ఉపయోగ కారి అవుతుంది.

దీపం వెలిగించే టప్పుడు ఈ క్రింది ప్రార్ధన చేస్తాము.
దీపం జ్యోతీ పరబ్రహ్మ దీపం స్సర్వం తమోపహః
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో2స్తుతే
అజ్ఞానాన్ని హరించి, జ్ఞానాన్ని ఇచ్చి అన్నింటిని సిద్ధింప చేసికొనే శక్తినిచ్చే సంధ్యా దీపానికి ప్రణామములు.

ఈ ఆచారము జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక సంపదను సూచిస్తుంది.


చిన్మయారణ్యం పబ్లికేషన్స్ ట్రస్ట్ వారి సౌజన్యం తో