A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Thursday, October 31, 2013

దీపావళి

శ్రీ గురుభ్యోనమః
మీ అందరికీ ముందస్తుగా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!


అందరూ దీపావళి పండుగను చక్కగా అందంగా ఆనందంగా ప్రమాదరహితంగా జరుపుకోవాలని కోరుకుంటూ, పోయిన సంవత్సరం పంచుకున్న దానికి కొద్ది మార్పులతో.. దీపావళి గూర్చి చిన్న వివరాన్ని రోజు చేయవలసిన విధులు అందరికీ ఉపయోగపడతాయని పొందుపరిచాను.

"ప్రాతః స్నానంతు యఃకుర్యాత్ యమలోకం నపశ్యతి" - విధిగా నిత్యమూ వేకువ ఝామునే స్నానం చేసినవానికి యమలోక దర్శనముండదని చెప్తారు పెద్దలు. స్నానం యొక్క పవిత్రత అది. ఎప్పుడోఅప్పుడు ఎలాగో అలాగ ఒళ్ళుకడుక్కోవడం స్నానం కాదు నియమంగా నియమిత వేళలో, నియమిత విధిలో స్నానం చేయాలి అది బాహ్యాంతరశ్శుచిని వృద్ధిని కలిగిస్తుంది.

ఆశ్వయుజ బహుళ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా
యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే

నరక చతుర్దశినాడు సూర్యోదయాత్ పూర్వం నువ్వులనూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలి. దీనివలన కలిగే ఫలితం కేవలం ఋష్యాదులు మాత్రమే దర్శించగలరు దాని ఫలితం ఇంత అని మానవ మాత్రులు దర్శించలేరు. యతులతో సహా అందరూ ఇలాగే రోజు స్నానం చేయాలని శాస్త్రవాక్కు.

అలానే దీపావళినాడు నూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలి
తైలే లక్ష్మీ ర్జలే గంగా దీపావళి తిథౌ వసేత్
అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే


దీపావళినాడు సూర్యోదయాత్ పూర్వం రాత్రి చివరి ఝాములో లేదా సోర్యోదయానికి 4ఘడియల ముందుగా (అంటే కనీసం 4-4:30 మధ్యకాలం అనుక్కోండి) నువ్వుల నూనె తో తలంటుకుని స్నానం చేయాలి. దీపావళినాడు సమయంలో ఎక్కడెక్కడున్న నువ్వులనూనెలోనూ లక్ష్మీదేవి, అలాగే అన్ని నీటి స్థానాలలోనూ గంగాదేవి నివసించి ఉంటారు. కనుక సమయంలో నువ్వులనూనె వంటికి రాసుకుని, తలంటుకొని స్నానం చేసినవారికి అలక్ష్మి పరిహరింపబడుతుంది. అలాగే గంగా స్నాన ఫలితం దక్కుతుంది. స్నానం చేసేటప్పుడు పైశ్లోకాన్ని ఒక్కసారి పఠించి నమస్కరించి స్నానం చేయడం మంచిది.  అలాగే ఇలా సూర్యోదయానికి ముందు అరుణోదయ సమయంలో (అంటే సూర్యోదయానికి 4 ఘడియల పూర్వం రమారమి 4-4:30 మధ్యలో) ప్రకారం స్నానం చేసినవారికి యమ లోకము కనపడదు.

అపామార్గం మథౌతుంబీం ప్రపున్నాట మథాపరం
భ్రామయేత్ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవై

స్నానం మధ్యలో ఉత్తరేణి, ఆనప లేదా ప్రపున్నాట మొక్కను తల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ స్నానం చేయాలి. అలాచేస్తే నరక ప్రాప్తి లేదు. అకాల మృత్యువు రాదు అని శాస్త్రం పెద్దల వాక్కు. ఉత్తరేణి లేదా అపామార్గ చాలా విరివిగా దొరుకుతుంది. లేకపోయినా ఆనప, ప్రపున్నాట మొక్కలను వాడవచ్చు. ఇలా స్నాన మధ్యంలో మొక్కలను తల చుట్టూ తిప్పుతూ ఉన్నప్పుడూ క్రింది ప్రార్థనా శ్లోకం / మంత్రం చెప్పుకోవాలి

శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః 

తా: దున్నిన మట్టి పెళ్ళలతో కలిసినది, ముళ్ళతో ఉండే ఆకులు గలదీ అగు అపామార్గమా! నిన్ను నాచుట్టూ తిప్పుతున్నాను. మళ్ళీ మళ్ళీ తిప్పడం వల్ల నువ్వు నాపాపాన్ని హరించు అని చెప్తూ చేయాలి.

ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే దక్షిణానికి నిర్భయంగా తిరిగి యమునికి మూడు సార్లు నమస్కరించమని పెద్దలు చెప్తారు. తరవాత నిత్యవిధులైన సంధ్యాదులు అయ్యింతరవాత యమధర్మరాజుగారికి నమస్కరిస్తూ క్రింది శ్లోకం చెప్పి మూడు మార్లు తర్పణం ఇవ్వాలి

యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయచ
వైవస్వతాయ కాలాయ  సర్వభూత క్షయాయచ!
ఔదుంబరాయ  ధర్మాయ నీలాయ పరమేష్ఠినే
మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!!
యమం తర్పయామి! యమం తర్పయామి !యమం తర్పయామి !
(అని నువ్వులతో మూడు మార్లు తర్పణలు వదలాలి.)

యమధర్మరాజుగార్కి పితృత్వం దైవత్వం రెండూ ఉన్నాయి దక్షిణాభిముఖంగా నిర్భయంగా తిరిగి ప్రాచీనావీతిగానూ, నివీతిగానూ తర్పణం ఇవ్వవచ్చు. తల్లి దండ్రులున్నవారు మాత్రం నివీతిగానే చేయాలి అని పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి వాక్కు.

మాషపత్రస్య శాకేన భుక్త్వాతత్ర దినే నరః
ప్రేతాఖ్యాయాంచతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే.

ఈనాడు తప్పకుండా మినప ఆకు కూర తినాలి. (మినపాకు ఎక్కడ దొరుకుతుందీ అన్న సందేహం వద్దు, మినుములు నానేసుకొంటే మొలకలొస్తాయిగా (అదే స్ప్రౌట్స్) వాటినే కొద్దిగా కూర లాగ చేసుకుని తినవచ్చు .. )

సాయంకాలం ఇళ్ళలోనూ, గుళ్ళలోనూ అన్ని ప్రదేశాలలోనూ దీపాలు పెట్టాలి. నువ్వులనూనెతో పెట్టమని శాస్త్రం. దీపదానం చేయటం కూడా కద్దు. ఇక్కడ్నుంచి కార్తీక మాసమంతా దీపదానం, దీపతోరణాలు, ఆకాశ దీపోత్సవాలే.

దీపావళి సాయంత్రం దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకి మార్గం చూపడానికి మగపిల్లలు దివిటీలను (ఉల్కాదానం) చూపాలి,  తరవాత కాళ్ళూ చేతులూ కడుక్కుని ఏదైనా మధుర పదార్థం తినాలి. దివిటీలను గోగు కర్ర, చెఱకు గడ, బొబ్బాస ఆకు, ఆముదం ఆకు, గోంగూర చెట్టు వంటి వాటికి కట్టి వెలిగిస్తారు.

ముఖ్యంగా దీపావళి లక్ష్మీ పూజకి ప్రసిద్ధి ముందురోజైన నరక చతుర్దశి నుండి బలి పాడ్యమి వరకు బలి చక్రవర్తి భూమిమీదకు వచ్చి తన అధికారం చేసేటట్లు, రోజుల్లో లక్ష్మీ పూజ చేసేవారి ఇంట లక్ష్మి సుస్థిర నివాసం ఏర్పరచుకునేటట్లు వరం కోరుకున్నాడు కాబట్టి మూడు రోజులు లక్ష్మీ పూజతో పాటు భగవత్సంకీర్తనం జాగరణం చేసే ఆచారం ఉంది.

దీపావళినాడు దీపంలోనే లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజించాలి. అలక్ష్మిని పంపేయటానికి ఢక్కాలు వాయించడం, దివిటీలు వెలిగించడం, టపాసులు పేల్చి చప్పుడు చేయడం, ఆచారమైంది. ఇంతకు ముందు ఋతువులో పుట్టిన క్రిమి కీటకాదులు దేవతాహ్వానం చేయబడిన దీపాదులు బాణాసంచాదులలో పడి జన్మ నుండి విముక్తిని పొందుతాయి ఉత్తరజన్మలకు వెళతాయి. అంతే కాని లేని పోని ఆడంబరాలు లేక వాతావరణ కాలుష్యం కోసం కాదు. ఇంత గొప్ప సాంప్రదాయం మనది.

జ్ఞాత్వా కర్మాణి కుర్వీత -  తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్య కార్యానికి ఫలం ఉంటుంది, తెలిసి చేస్తే మరింత జాగురూకతతో చక్కగా చేయవచ్చు అని పరమాచార్య ఉద్భోధ.


మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ

Thursday, September 26, 2013

హారతి వల్ల లాభము ఏమిటి?

హారతి వల్ల లాభము ఏమిటి?

గృహములోను, పూజాగదిలోనే కాడు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడూ….పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేతప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. సుభాకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగాకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటూవ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిచేసిన పోతుందో, అలాగే మనం తెలిసీ సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం.

Wednesday, September 25, 2013

సీమంతంలో గాజులు తోడిగేదేందుకు ?

సీమంతంలో గాజులు తోడిగేదేందుకు ?




ఏ శుభకార్యములో లేని విధంగా సీమంతం సమయములో గర్భినికి అందరు గాజులు తొడుగుతారు . ఐదోతనంతో పాటు పండంటి బిడ్డను కనాలని ఆశిర్వాదిస్తారు . అలా గాజులు తొడిగే కార్యములో చక్కని పరమార్థం దాగుంది
. గర్భం ధరించిన స్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి.


అందుకే ఏడో నెలలో శుభకార్యము చేస్తూ అయినవాళ్ళంత గాజులు తొడుగుతారు . చేతుల్లో నరాలకి, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది . అలా ఎక్కువగా గాజులు తోడిగించుకోవటం ద్వార గర్భకోశంపై సరియైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుంది.

వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?

వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?

రుతుధర్మాన్ననుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. యేటా వర్ష రుతువు చివర్లో భాద్రపద శుద్ధ చవితినాడు వస్తుందీ పండగ. వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళాలు వెదజల్లుతుంటాయి.

నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతియైన హస్త... వినాయకుని జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనకు గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం.

గణేష పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలో ఒక విశేషముంది. అదేమంటే జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టికోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీకాక మట్టిని తాకడం, దానితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతారు.

ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని వాడటం మనకు తెలిసిందే. అయితే పదిరోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున మేళతాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు.