A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Friday, March 15, 2013

గురువు - ఆచార్యుడు

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు
శ్రీ గురుభ్యో నమః
శ్రీ గణేశాయ నమః
శ్రీ శరవణభవాయ నమః
శ్రీమాత్రే నమః
ఓం నమః శివాయ
శ్రీ సీతారామాభ్యాం నమః
శ్రీ హనుమతే నమః
గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!!

 
పెద్దలందరికీ నమస్కారము,

పూజ్యులు ప్రాతఃస్మరణీయులు కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతులు,నడిచే దేవుడు, పరమాచార్య, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర స్వరస్వతీ మహాస్వామి వారు తమిళంలో చేసిన ప్రవచనములలో, "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" అనే అంశముపై చేసిన ప్రవచనముల యొక్క తెలుగు అనువాదము, కామకోటి వారి సైట్ లో లభిస్తే, దానినే యథాతథంగా, మరొక సారి పునశ్చరణ చేసినట్లు అవుతుందనీ, ఇలా వ్రాయడం వల్ల, జగద్గురువుల అనుగ్రహం లభిస్తుందనీ ఆర్తితో, నేను నేర్చుకోవడం కొరకు, నా ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసమై, ఇక్కడ వ్రాసుకుంటూ, అందరితోనూ పంచుకుంటున్నాను. తప్ప ఇక్కడున్న పెద్దలకు తెలియనివి కావు.


1. గురువు - ఆచార్యుడు
మనం సాధారణంగా వాడుకలో రెండు పద ప్రయోగాలు చేస్తూ ఉంటాము. ఇవి మనం పర్యాయ పదాలుగా భావించినా, పండితులు ఈ రెండిటినీ కాస్త భిన్న దృక్పథంలోనే చూస్తారు. ఆ పదాలే "గురువు", "ఆచార్యుడు".

ఆచార్యుడు అనే పదం - ఆచరణ, ఆచార అనే పదములకు సంబంధించినది. చర అంటే నడుచుత, చరిత, చరిత్ర అంటే నడత. దేశ చరిత్ర అంటే ఒక దేశములో ఏమేమి జరిగినదో తెలిపే పుస్తకం. జీవిత చరిత్ర అంటే ఒక మనిషి పుట్టినదాది ఏమేమి చేశాడో చెప్పే కథ. ఆచారం అంటే ఒక సమూహములోని వాడుకలు, నడవడికలు.

ఆచార్యుడు అంటే మనం జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధమైన నైతిక ప్రవర్తన శిష్టాచారములను అనుసరించాలో చూపే మార్గ దర్శకుడు. అహింస, సత్యము లాంటి సామాన్య ధర్మములు మనకున్నవి. మన మతములో ఎన్నో సాంప్రదాయాలున్నాయి. ఆచారాలున్నాయి. ఒక్కో సాంప్రదాయానికి వేర్వేరు శాస్త్రాలున్నవి, వైష్ణవులది ఒక ఆచారము, మాధ్వులకు మరొక ఆచారం. ఒక్క శైవ సాంప్రదాయములోనే ఎన్నో శాఖలున్నవి. వీరశైవం, కాశ్మీరశైవం, పాశుపతం, సిద్ధాంతము ఇత్యాదివి.

ఆచార్య పదం వివరించే ఒక శ్లోకం ఉన్నది ... "అచినోతిః శాస్త్రార్ధాన్ ఆచారే స్థాపయత్యపి - స్వయం ఆచారతేయశ్చ తం ఆచార్య ప్రచక్షతే".
ఎవడైతే శాస్త్రార్ధములను చక్కగా విచారిస్తున్నాడో (ఇతరులకు వాటిని బోధిస్తున్నాడని గర్భితం), ఆ ఆచారములను తాను స్వయముగా అనుష్టిస్తున్నాడో, అంతటితో వదలక, ఆ ఆచారములను ఇతరులచే అనుష్టింపచేస్తున్నాడో... అతడే ఆచార్యుడు. ఇతరులకు బోధ చేయడం, తాను స్వయంగా ఆచరించడం. ఈ రెండూ చేసేవాడే నిజమైన ఆచార్యుడు.

మనం ఆచారం, అనుష్టానం అంటూ ఉంటాము. అవి రెండూ పరస్పర సంబంధము కలవి. శాస్త్రోక్తములైన ఆచారములను అనుసరించేవే సంప్రదాయాలు. శాస్త్రములనేవి విధి, నిషేధాలను నిర్ణయించే గ్రంధాలు. సంప్రదాయాలు అనూచానంగా వచ్చే వాడుకలు, ఆచారాలు. వైదిక మతము ఆధారముగా ఏర్పడినవే శాంకర, రామానుజ ఇతర వైదిక సాంప్రదాయాలు. శాస్త్రములు సామాన్యముగా ఉన్నా సాంప్రదాయములు వేరుగా ఉండవచ్చు. ఈ విధంగా ఒక నియమ జీవనం చేస్తూ శాస్త్రోక్తమైన ఆచార అనుష్టానాలను పాటిస్తూ, ఇతరులకు బోధిస్తూ, వారిచే వాటిని అనుష్టింపచేస్తూ, తాను ఇతరులకు ఒరవడిగా ధర్మమూర్తిగా ఉన్నవాడే ఆచార్యుడు. అట్టి ఆచార్యునికి ఒక శిష్యుడు ఉండాలి. ఆ శిష్యునికి తన సాంప్రదాయ ధర్మములను బోధించి అనుష్టింపచేయాలి. అతడు విద్వాంసుడిగా ఉండాలి. విద్వత్తు లేకపోతే అతడు ఇతరులకి ఏమి బోధ చేయగలడు? తన అనుచరుల ధర్మ సందేహాలకు అతడు జవాబు చెప్పాలి. తన సాంప్రదాయానికి ప్రతి పక్షంవారికి యుక్తి యుక్తముగా జవాబు చెప్పాలి. అట్టివాడే ఆచార్యుడు అనిపించుకొంటాడు.

ఈ కాలంలో ఆచార్యులు బళ్ళు, కళాశాలలో ఉండే అధ్యాపకులు. వారికి ఆచరణలో కానీ, బోధనలో కానీ ఏ విధమైన ధర్మమూ లేదు. పూర్వకాలంలోనూ కళలకు ఆచార్యులు ఉండే వారు. ద్రోణాచార్య, కృపాచార్యులు ధనుర్వేద ఆచార్యులు. వారు వారి కళలలోనే కాక సాంప్రదాయములోనూ ధర్మములోనూ కుశలులు. వారి యొక్క అనుష్టానాలకే వారు గౌరవింపబడినారు.

2. గురు లక్షణం
ఆచార్యుని సమక్షంలోనే ఉంటూ విద్యాభ్యాసం చేయడం గురుకులవాసం. కానీ దానిని "ఆచార్య-కుల వాసము" అని మనం అనడం లేదు. అందుచేత గురువు-ఆచార్యుడు ఒక్కరే అని ఆర్ధం అవుతుంది. జగద్గురు శంకారాచార్య అని వ్యవహరించినప్పుడు, ఒకే వ్యక్తి గురువుగా, ఆచార్యుడిగా ఉన్నారని అర్ధం.

గురువు అంటే ఏమిటి? గురువు అనగా ఘనమైనది, పెద్దది అని అర్ధం. మహిమ కలవాడని అర్ధం. బ్రహ్మ అంటే కూడా గొప్ప, పెద్ద అని అర్ధం. గురువు దేనిలో పెద్ద?? మీరందరూ నన్ను పెరియావా, పెరియావర్ అని పిలుస్తారు. (ఈ మాటలు పరమాచార్య స్వామి వారు ప్రవచనాంతర్గతముగా భక్తులతో అన్నవి....). నేను దేనిలో పెద్ద? శరీర ప్రమాణంలోనా? నాకు శంకరాచార్యుడు అని పేరు ఉండడం వలన మీరందరూ ఆయన గుణగణములూ, మహత్వమూ నాలో ఉన్నదని ఏమరి, నన్ను పెరియావా అనీ, మహాన్ అనీ పిలుస్తున్నారు.

మొత్తం మీద గురువు అంటే అంతర్గతముగా ఒక ఉత్తమ స్థితిని అందుకొన్నవాడు అని తేలుతోంది. బాహ్యంలో ఒక వ్యక్తి యొక్క నడతా, విద్వతూ అతనిని ఆచార్యునిగా నిర్దేశిస్తుంది. అతని ఆచార అనుష్టానాల వలన, అతని బోధనా చాతుర్యం చేతనూ, అతని శీలసంపద చేతనూ మనం ఒకరిని ఆచార్యునిగా ఎన్నగలము.

ఇక గురువు మాట ఏమిటి? అతను బహిరంగముగా ఏదీ చేయవలసిన అవసరము లేదు. అతనికి శాస్త్ర పరిజ్ఞానమో విద్వత్తో ఉండనక్కర్లేదు. ఆచార్యుని వలె అతను సాంప్రదాయ, ఆచార అనుష్టానాలకు మార్గదర్శిగా ఉండనవసరమూ లేదు. అతను నోరు తెరిచి మాట్లాడవలసిన అవసరమూ లేదు. ఉపదేశాలు ఇవ్వనక్కర్లేదు. ఎంతో మంది మౌనగురువులు, ధ్యాననిష్ఠులు ఉంటారన్న విషయం మనకి తెలిసనదే.

తాను తానుగా ఉంటూ, ఏకాంతంగా పూర్ణత్వం భజిస్తూ, ఎవరైనా ఉంటే అతని ప్రభావం గుర్తించి ప్రజలు అతనిని గురువుగా వరిస్తారు. అంతమాత్రాన అతడు వీరికి శాస్త్రపాఠాలు చెప్పవలసిన అవసరము లేదు. అతనిని గురువుగా వరించిన వారికి అతని అనుగ్రహశక్తియే పనిచేస్తుంది. వీరిని అతడు శిష్యులుగా భావించి కూడా ఉండకపోవచ్చును. కానీ ఆయనను గురువుగా ఏ ఫలాన్ని ఉద్దేశించి ఆశ్రయించారో, ఆ ఫలం వీరికి శులభంగా సిద్ధిస్తున్నది.

ఏ శాస్త్రాచారమూ పాటించని ఇలాంటి గురువులెందరో ఉన్నారు. ఉన్మత్తులవలె, పిశాచముల వలే నిరంకుశులుగా తిరిగిన అత్యాశ్రములు ఎందరో గురువులుగా మన దేశంలో ఉండేవారు. ఈ విధంగా దిగంబరంగా తిరిగిన దత్తాత్రేయులు అవధూత గురువు అని ప్రసిద్ధి పొందారు.

ఒక మార్గాన్ని అనుసరించి పోయేవాడు ఆచార్యుడు. ఒక శాస్త్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ, అతడు శాస్త్ర నిష్ణాతగా ఉండడమే కాక, శాస్త్ర విధులను తాను అనుష్టిస్తూ ఇతరులకు బోధచేస్తూ, వారిచేత వానిని అనుష్టింపచేస్తూ
విధివిధానముగా మార్గదర్శకముగా ఉండేవాడే ఆచార్యుడు. గురువు అట్లా కాదు.  అతనిని మహాత్ముడు అంటారు, అతని ఆత్మానుభవం కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉండడం చేతనే అతనిని ప్రజలు గురువుగా వరిస్తున్నారు. వారికి శీలానుష్టానాల అవసరం లేదు. వారికి శాస్త్ర విజ్ఞానం ఉండాలన్న నియమం లేదు. వారు జ్ఞానులు, వారెప్పుడూ బ్రహ్మ నిష్టలో ఉండేవారు. వారెప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలో ఉండే ఆనందోన్మత్తులగానో, చిత్తవృత్తుల నిరోధంతో సమాధి స్థితిలో ఉండే యోగులగానో ఉంటారు.

ఒక గురువు స్వయంగా "గురుత్వం" ఒప్పుకోకపోయినా, "నేను నీ శిష్యుడను" అని అతనిని ఆశ్రయించిన వాని మధ్యా, అయిష్టుడైన ఆ గురువు మధ్యా ఒక సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధం అతని అనుగ్రహం వల్లనే. గురువు అంటే ఘనమైన వాడు అని చెప్పాము. ఒకరికి అంతరంగిక ఘనత ఉంటుంది. కానీ అతనికి బహిర్ప్రపంచముపైన ఏ కోరికా లేకపోవచ్చు. అతనికి అతని ఆత్మానుభూతిలోనే నిష్ట, అతడు గురువుగా చేయవలసిన కర్తవ్యం ఏదీ లేదు. 'గు' అంటే అంధకారం, 'రు' అంటే తన్నిరోధకం. గురువు అంటే చీకట్లను పారద్రోలేవారు. అజ్ఞాన నివర్తకుడు. దేశ శబ్దానికి ప్రకాశరూపి అని అర్ధం. "తమసోమాజ్యోర్గమయ". మనం అంధకారంలోంచి ప్రకాశంలోకి రావాలి. తమస్ అంటే చీకటి, జ్యోతిస్ అంటే వెలుతురు. అజ్ఞానం అంటే చీకటి, వెలుతురు (జ్ఞానం) ప్రకాశిస్తే కానీ చీకటి పోదు. ఒక విషయాన్ని గురువు బోధిస్తాడు. శిష్యుడు తన బుద్ధిచేత దానిని గ్రహిస్తాడు. అజ్ఞానమనే అంధకారంలో ఉన్న శిష్యునికి జ్ఞానబోధ చేయగలిగినది ప్రకాశరూపియైన గురువు ఒక్కడే.

ఒక మహాత్ముడుంటాడు, అతనికి శాస్త్ర విజ్ఞానం లేదు, అతని అనుష్టానమూ శాస్త్రీయము కాదు. శాస్త్రబోధ అతనికి కానిపని. అయినపటికి అతనిని ఎవరైనా 'గురువు'గా ఆశ్రయిస్తే, అతను ఆశ్రయితుడి అంతర్ధ్వాంతాన్ని అనయాసంగా పోగొట్టగలడు. అతని అనుగ్రహం చేత అనధీతమైన శాస్త్రాలన్నీ ఆశ్రితునికి అవగతాలౌతాయి.

గురువంటే చీకటిని పోగొట్టేవాడు. అతని ఆత్మశక్తి బహిర్ముఖంగా పనిచేస్తుంది. అతను వాగ్రూపముగా వరదానము చేయడంలేదు. మార్గదర్శకముగా ఉండాలన్న కోరికా అతనికి లేదు. అనుగ్రహం చేద్దామన్న ఇఛ్చయూ లేదు. కేవలం ఈశ్వర శక్తి, శిష్యుని గురుభక్తి మెఱుపువలే వరప్రదానం చేస్తుంది. అతను అల్పమైన ప్రాపంచిక విషయాభిలాయగానైనా ఉండవచ్చు. లేదా అతడు బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించి అయినా ఉండవచ్చు.

ఒక కర్తవ్యం జరగాలంటే గురు-శిష్య సంబంధం ఉండాలి. ఇంట్లో దీపం వెలిగించాలంటే, విద్యుఛ్చక్తికీ దీపానికీ మధ్య లంకె ఉండాలి. ఆ లంకె తంతి ద్వారా ఏర్పడుతుంది. జలాశయాలనుంచి ఇంట్లో కొళాయిలోకి నీళ్ళు రావాలంటే, పెద్దజలాశయము నుండి నగరానికి మధ్య పైపులు వేయాలి. అప్పుడే కొళాయి నుంచి నీళ్ళు రాగలవు. గురువు వాగ్రూపముగా ఉపదేశము చేస్తూ ఉంటే, గురుశిష్యుల మధ్య సంబంధం గురువు వాక్కులే. లేదా గురువు జీవితములోని ఆచార వ్యవహారాలే శిష్యుడికి ఉపదేశ ప్రాయముగా ఉంటాయి. గురువు మౌనముగా ఉంటూ ఒక సంకల్పము చేస్తే, అదే శిష్యునికి ఉపదేశమవుతుంది. గురువు ఉపన్యాసాల చేతనే ఉపదేశం చేయాలన్న నియమమేమీ లేదు. ఆయన జీవితమే ఒక పెద్ద ఉపదేశం. ఉపదేశ విధానము స్థూలమే కాదు, సూక్ష్మము కూడా.

ఒక గురువు వాగ్రూపముగానూ, తన ఆచార, అనుష్టానము చేతనూ శిష్యునికి బోధిస్తే, అతనిని ఆచార్యుడని అంటారు. ఒకడు ఉపదేశమూ చేయకపోవచ్చు. మార్గదర్శకంగా ఉండకుండా పోవచ్చు. కానీ అతని అనుగ్రహమే గురుశిష్యుల మధ్య ఏర్పడిన అవ్యక్త సంబంధమని ఇదివరకే చెప్పాను.. (పరమాచార్య వారి మాటగా దీనిని చదవగలరు..). ఆ అనుగ్రహమే అతడిచ్చే ఉపదేశము.

ఇట్లా ఉండే గురువులలో కొందరూ ఆచార్యులుగా ఉండడమూ కద్దు. శిష్యులకు బోధిస్తూ, శాస్త్రానుష్టానాలను స్వయంగా ఆచరిస్తూ అంతరంగములో సమాధి అవస్థలో ఉండగల గురువులూ ఉన్నారు. శంకర భగవత్పాదులు ఇటువంటి గురువులు. ఇతర సాంప్రదాయలలోనూ ఒకే వ్యక్తి గురువుగా ఆచార్యునిగా ఉన్నవారు ఉన్నారు.

పూర్వకాలములోని విద్యాగురువులు గొప్ప శీలమూ నిష్టా కలిగినవారు. ఆత్మానుభూతి కానీ, సమాధి అవస్థ కానీ వారు ఎరుగకపోవచ్చును. కానీ ఆచార అనుష్టానాల బలం చేత వారు గురుకులములను నడుపుతూ శిష్యకోటికి విద్యాదానం చేసేవారు. మరికొందరు స్వయంగానో, లేక శాస్త్ర సమ్మతమైన దానినో ఆశ్రితులకు ఉపదేశం చేసేవారు ఉండేవారు. అట్లు ఉపదేశం చేసిన వారి జీవిత కాలంలో వారి బోధనా విధానం శాస్త్ర విధానంగా పరిగణింపబడకపోయినా వారి అనంతరం వారి విధానం, వారి పేరిట చెలామణీ అయి వ్యాప్తి చెందేది. అట్టి గురువులు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని అందుకున్నవారే. ఏ విధానానికి సంబంధించని గురువులూ ఎంతో మంది ఉన్నారు.

(సశేషం...)

సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.

-- SRI MOHAN KISHOR NEMMALURI

No comments:

Post a Comment