A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Friday, March 15, 2013

రామానుజ సాంప్రదాయంలో

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

14. రామానుజ సాంప్రదాయంలో

రామానుజ సాంప్రదాయములో పరస్పరము మర్యాద చేసుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తారు. మనం నీవు-మీరు అని వ్యవహారంలో చెప్పుకుంటే వారు దేవరీర్ (తమిళం) అన్నపదం వాడతారు. తమని దాసులు అని చెప్పుకుంటారు. ఇతర సాంప్రదాయస్తులను 'స్వామీ' అని పిలుస్తారు. వైష్ణవులలో వృద్ధులను 'పెరుమాళ్' అని వ్యవహరిస్తారు. వారి మర్యాద ఒక్కొక్కప్పుడు విపరీత ప్రమాణంలో ఉంటుంది.

ఈ విషయంలో చెప్పుకునే కథ తమాషాగా ఉంటుంది. ఒక మఠాధిపతి క్రింద శిష్యుడొకడు ఉండేవాడు. గురువు స్థానంలో తాను రావాలని అతనికి ఆశ. గురువు కోసం అతనొక గోతిని త్రవ్వినాడి. గురువు దగ్గరకు వెళ్ళి 'దేవతలైన తాము (దేవరీర్) స్వయంగా గోతిలో దూకుతారా? లేక ఈ దాసుణ్ణి ఆ కైంకర్యం చెయ్యమంటారా? అని మర్యాదతో అడిగాడట.


వైష్ణవాలయాలలో ఆళ్వారుల సన్నిధులుంటాయి. అందులో ఆండాళ్ సన్నిధి విశేషమైనది. తెంగల శాఖకు చెందిన మనవాళముని, పిళ్ళైలోకాచార్యుల సన్నిధులు ఉంటాయి. వడగలైశాఖకు చెందిన ఆలయాలలో వేదాంతదేశికుల సన్నిధి ఉంటుంది. రామానుజులు శ్రీపెరంబదూరులో జన్మించారు. ఆ క్షేత్రంలో రామానుజులకే ప్రాధాన్యం. పెరుమాళ్ళకు రెండవ స్థానమే. అచట రామానుజులకు పదిరోజుల ఉత్సవం చేస్తారు. రోజూ ఆరాధన, ఆయన సన్నిధి మీద బంగారు విమానం కట్టారు.


శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళుకు ప్రముఖస్థానం. ఆమెను గోదాదేవి అని అంటారు. మధురలో మీనాక్షికే ప్రాధాన్యం. సుందరేశ్వరునికి ద్వితీయస్థానం. నమ్మాళ్వార్ జన్మస్థలం కురుకూరు. ఆయన గౌరవార్ధం దానిని ఇప్పుడు 'ఆళ్వార్ తిరునగరి' అని పిలుస్తున్నారు. ఆయనకూ విశేష ఉత్సవాలు చేస్తుంటారు. వైష్ణవ సాంప్రదాయాచార్యులలో నాదముని, ఆలవిందార్, మనక్కాల్, నంబి, తిరుక్కాచ్చినంబి, కూరత్తాళ్వార్, భట్టర్, నాచ్చియార్ ముఖ్యులు. ఆలయాలలో వీరి సన్నిధిలో పూజలు, ఉత్సవములు జరుగుతూ ఉంటాయి. శివాలయాలలో నాయన్మారులకు ఇంత ప్రాముఖ్యం ఇవ్వటం లేదు.


ఇంతకూ చెప్పవచ్చినదేమిటంటే వైష్ణవ సాంప్రదాయములో ఆచార్యభక్తి అధికమని, రామానుజుల శిష్యులు వారికి అతివేలంగా భక్తిని నెరపేవారు. ఆయనకోసం ప్రాణత్యాగం చేయడానికైనా వెనుదీసేవారు కాదు. అట్టివారిలో కూరత్తాళ్వార్ ఒకరు. వారి గ్రామం కంచికి సమీపంలో ఉన్న 'కూరం'.


రామానుజుల కాలంలో ఉన్న చోళరాజు పరమశైవుడు. రామానుజులు విష్ణ్వాధిక్యమును బోధించే ఆచార్యులు. చోళుల రాజధాని గంగైకొండచోళ పురం. రామానుజులు శ్రీరంగంలో ఉన్నారు.  రాజు రామానుజులను తమ సిద్ధాంతాన్ని గూర్చి చర్చ చేయడానికి ఆహ్వానించారు. కూరత్తాళ్వారు పరమశైవుడైన చోళరాజు తన గురువుకు ఏమి అపకారం చేస్తాడో అని భయం వేసింది. అందులో ఆ కాలపు రాజులు నిరంకుశులు.


కూరత్తాళ్వార్ రామానుజుల వేషంలో రాజువద్దకు వెళ్ళాలని నిశ్చయించారు. రామానుజులు ధరించే కాషాయాలను శిష్యుడు ధరించాడు. రామానుజులు శ్వేత వస్త్ర ధారియై కర్ణాటక దేశంలోని తిరునారాయణపురం వెళ్ళారు. ఈ సంభవాన్ని స్మరిస్తూ ఇప్పటికీ 'వెళ్ళైచ్చాత్తుపడి' (తెల్లని వస్త్రములు ధరించుట) అనే ఉత్సవం చేస్తారు.


చోళరాజు సమక్షంలో కూరత్తాళ్వార్ శివాధిక్యాన్ని ఒప్పుకోలేదు. రాజు ఉగ్రుడై కూరత్తాళ్వార్ కండ్లను పీకించాడు. కూరత్తాళ్వార్ సంతోషంగా శిక్షను అనుభవించాడు. చోళరాజు మరణానంతరం రామానుజులు తమిళ దేశానికి మరలివచ్చారు. శిష్యుని దురవస్థకు ఎంతో చింతించారు. రామానుజులు మొదట కంచిలో వరదరాజస్వామిని సేవించేవారు. శ్రీరంగంలో ఉన్నప్పుడు రంగనాథస్వామిని సేవించారు. కానీ వరదరాజులు అంటే వారికి విశేషానురాగం. నీవు నీ దృష్టి కోసం వరదరాజును ప్రార్ధించు అని కూరత్తాళ్వార్
తో చెప్పారు. కూరత్తాళ్వార్ భగవద్దర్శనం కావాలంటే ఇంద్రియాలు నిగ్రహించాలి. రాజు పుణ్యమా అని కండ్లు పోయి, ఇంద్రియాలలో ఒక ఇంద్రియ నిగ్రహం స్వతఃసిద్ధమైనది. దృష్టి మరలా మరలా వస్తే ఈ ప్రపంచములో చూడడానికి ఏముంది? కానీ మీ ఆజ్ఞ జవదాటరాదు. మీరు చెప్పినట్లు చేస్తాను. వరదరాజు నాకు మళ్ళీ కళ్ళు ఇవ్వనీ, కానీ నా గురువులైన మిమ్మల్నీ, వరదుణ్ణీ చూడగలగితే చాలు. ఆ కండ్లకు ఇతర విషయాలు గోచరం కారాదు' అన్నాడట. ఆయన కోరినట్లే వరదరాజు ఆయనకి వరదానం చేశాడు.

రామానుజులకు పూర్వమున్నవారు ఆళవందార్. వారికి కర్మ శేషమున్నందువలన పరమ ప్రాప్తికి ఆలస్యమైనది. ఆ కర్మ శేషాన్ని తాను అనుభవిస్తానని ఒక శిష్యుడు ప్రార్ధించాడు. ఆళవందార్ తరఫున ఆ శిష్యుడు రాచపుండుతో బాధపడి గురువు యొక్క కర్మ శేషాన్ని తొలగించాడు.

ఈ గురుపరంపర కథలలో ఒకటి - కొంచెం హాస్యంగానే ఉంటుంది.

రామానుజులకు వడుకనంబి అని శిష్యుడొకడు ఉండే వాడు. ఇంట్లో అతను గురువు కోసం పాలను వేడి చేస్తూ ఉన్నాడు. వీధిలో రంగనాథస్వామి ఉత్సవ మూర్తి వెళుతూ ఉంది. 'స్వామిని దర్శించు' అని రామానుజులు శిష్యుని కేకవేశారు. శిష్యుడు వినిపించుకోలేదు. రామానుజులు శిష్యుణ్ణి దర్శనం ఎందుకు చేయలేదు అని మందలించారు. శిష్యుడన్నాడట.."మీ పెరుమాళ్లకు చేస్తున్న ఈ క్షీరసేవ మధ్యలో వదిలి వెళ్లడం భావ్యమా??" అని.

గురుభక్తి ఉండే శిష్యుడు గురుసేవలో సంతోషంగా ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాడు. పరశురాముడు శత్రువులకు విరోధి. కర్ణుడు అతని వద్ద ధనుర్వేదం నేర్చుకోవాలని బ్రాహ్మణ వేషంలో వస్తాడు. పరశురాముడు ఒకరోజు కర్ణుడి తొడపై తలపెట్టుకుని నిద్రపోతూఉండగా, ఒక కీటకం కర్ణుడి తొడ క్రింద చేరి తొలచనారంభించింది. గురువుకు నిద్రాభంగం అవుతుందని కర్ణుడు కదలక మెదలక కూర్చున్నాడు. అమితంగా రక్తస్రావం అయినది. పరశురాముడు నిద్ర నుండి లేచి కర్ణుడు బ్రాహ్మణవేషధారి కానీ, బ్రాహ్మణుడు కాదని తెలుసుకుంటాడు. మిగతా కథ మీకు తెలుసు.

ఆళ్వారులలో మధుర కవి ఒకరు. ఆయన 11 పాశురములు వ్రాశారు. వానిని నాలాయిర ప్రబంధంలో చేర్చారు. (నాలుగువేల స్తోత్రములు కల గ్రంధం). పాశురములు విష్ణుపరముగా ఉన్ననూ, మధురకవి వ్రాసిన పాశురములు నమ్మాళ్వారు గురించి చేసిన స్తోత్రములు. నమ్మాళ్వార్ కు 'ప్రపన్నజనకూటస్థుడు' అని బిరుదు ఉండేది.

మధురకవి బ్రాహ్మణుడు. నమ్మాళ్వార్ బ్రాహ్మణేతరుడు. మధురకవి ఉత్తరదేశంలో పర్యటిస్తున్నప్పుడు, దక్షిణభాగం నుంచి ప్రసరిస్తున్న ఒక కాంతి పుంజాన్ని చూశాడు. ఆ వెలుగును అనుసంధానంచేస్తూ వేయిమైళ్ళు దక్షిణదిశగా పయనం అయి వెళ్ళాడు. తిరుక్కరుకురై (ఆళ్వార్ తిరునగరి) చేరి అక్కడ ఒక గుహలో నుండి కిరణములు వెలువడుతున్నవి అని కనిపెట్టాడు. మధురకవి వెళ్ళి చూడగా ఆ గుహలో నమ్మాళ్వార్ ధ్యాననిష్టలో ఉన్నారు.

ధ్యానానంతరము, మధురకవి సంజ్ఞల మూలముగా ఆత్మతత్త్వము గురించి అడిగాడు. నమ్మాళ్వార్ కూడా సైగలతోనే సమాధానమిచ్చారు. అదే మధురకవికి మంత్రోపదేశం ఇచ్చినట్లైనది. "నమ్మాళ్వార్ పెరుమాళ్ళను గురించి స్తోత్రం చేస్తాను" అని పదకొండు పాశురములు వ్రాశారు. ఈ గురుభక్తి చాటే మధురకవి పాశురములను, పెరుమాళ్ల స్తోత్ర గ్రంధమైన "నాలాయిరము" లో చేర్చినారు. రామానుజులు తప్పించి తనకు వేరే దేవుడు లేరని వేదాంతదేశికులూ తమ గురుభక్తిని వ్యక్తం చేశారు.

15. శిక్కులలో గురుభక్తి

ఆచార్యుడు ఉన్నచో దైవం వేరే అక్కరలేదు. దేవుడు కూడా గురువుకి సమానం కాదు అని దాదాపు అన్ని సంప్రదాయములూ చెబుతాయి. శిక్కులు గురువు ఉంటే శిష్యుడు ఉండాలనీ, శిష్యుడు ఉంటే శిక్ష ఉండాలనీ అభిప్రాయపడతారు.

గురుగోవింద్ సింగ్ ఖాల్సాని స్థాపించినప్పుడు నరబలి ఇవ్వడానికి సభ్యులలో ఒకరిని ముందుకు రమ్మని అర్ధించారు. శిష్యుడొకడు ముందుకు వచ్చాడు. వానిని లోనికి తీసుకునిపోయి కొంతసేపటికి రక్తసిక్తమైన కత్తితో వచ్చి ఇంకొకరిని రమ్మన్నారు. ఈ విధంగా ఐదు మార్లు లోపలికి తీసుకువెళ్ళి, ఐదుమార్లూ రక్తసిక్తమైన హస్తములతో బయటికి వచ్చారు గురుగోవింద్. పిదప ఆ ఐదుగురినీ బయటపెట్టి, మీ భక్తిని పరీక్షించడానికే ఈ పన్నాగం అని వివరించారు. నిజంగా ఆ ఐదుగురిని ఆయన చంపలేదు. ఆ రక్తం ఏదో గొర్రె రక్తం. ప్రాణత్యాగానికి సమ్మతించిన ఆ ఐదుగురినీ ఖాల్సాలో ముఖ్య సభ్యులుగా ఎన్నుకొన్నాడు.

గురుభక్తి సంపూర్ణముగా ఉన్న శిష్యునికి గురువు లక్షణములు స్వయంగా వరిస్తాయి. శిష్యులు మహాత్ములై స్వయంగా గురువులైన తర్వాత కూడా శిష్యరికం భజిస్తూ వారి గురువులను ఆరాధించడం మన సాంప్రదాయం.



(సశేషం .....)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

No comments:

Post a Comment