A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Friday, March 15, 2013

ఆచార్యుడే ఈశ్వరుడు

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

8.ఆచార్యుడే ఈశ్వరుడు
ఆచార్య పురుషులకు బంధము లేదు. వారు స్వతంత్రులు, నిత్యముక్తులు. మనకు నియమబద్ధ జీవనాన్ని చూపుటకొరకే వారు ఆచార్యులుగా వ్యవహరిస్తున్నారు. అట్టివారి సేవ శీఘ్రఫలదం. ఈశ్వరుడే ఆచార్యుని రూపములో మనకి జ్ఞాన దానం చేస్తున్నాడు. 'ఈశావాస్యమిదం సర్వం' అన్నారు. సర్వమూ ఈశ్వరుడే, అప్పుడు గురువులోనూ ఆచార్యునిలోనూ ఉన్నాడంటే అభ్యంతరమేమి?

అట్లా అయితే మనం ఎవరం? మనమూ ఈశ్వరులమే కదా. మరొకరిని ఆచార్యుడనీ, ఈశ్వరుడనీ మనమెందుకు ఆరాధించాలి?

అన్నీ అతడే. కానీ మన ఈశ్వరత్వాన్ని మనం స్వయంగా గుర్తించలేకున్నాము. కించిత్తైనా మన ఈశ్వరత్వాన్ని మనం గుర్తించగలిగితే ఈ కామక్రోధాలు, ఆశాపాశాలు, దుఃఖం, కష్టం, పాపం ఉంటాయా?? మనం ఈశ్వరులం అన్న జ్ఞానం లేక అలమటిస్తున్నాము. కానీ ఆచార్యునికి తన ఈశ్వరత్వం తెలుసు. ఆయనకు మనకున్న సుఖ దుఃఖాలు లేవు. అతడు ద్వంద్వాలకు అతీతుడు. మనలో చూడలేని ఈశ్వరత్వాన్ని అతనిలో మనం చూడగలుగుతున్నాము. ఈ సత్యాన్ని మనం తెలుసుకుని మనం ఆచార్యుని సేవ చేశామంటే, ఆయన మన అజ్ఞానమనే తెరని తొలగించి, మనలో సత్యప్రతిష్ట చేయగలడు.

అందుకని పరమార్ధ ప్రయోజనం కోసం ఆచార్యుని ఇప్పుడే ఇక్కడే ఈశ్వరునిగా భావించి విధేయులమై ఆయన అనుగ్రహం చేసిన ఉపదేశానుసారం జీవితాలను నడుపుకోవాలి.

9. స్వధర్మాన్ని పాటించండి
మన పూర్వ కర్మానుసారం ఈశ్వరుడు జన్మను విధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈశ్వరుడు మనల్ని ఏ మతంలో, ఏ శాఖలో, ఏ సాంప్రదాయంలో పుట్టించాడో తదనుసారం జీవితం గడుపుతూ కర్మక్షాళనం చేసుకుని పురుషార్ధాన్ని సాధించాలి. మన శాఖకో, జాతికో ఏర్పడిన ఆచార్యోపదేశం అనుసరించితే చాలు. ఆ సిద్ధాంతాలు అసంపూర్ణమైననూ పర్వాలేదు.

కర్మశేషం ఉండడం వలన జీవునికి పూర్ణత్వం అవగతమవడం లేదు. కానీ ఏ మతంలో పుట్టామో ఆ మతం అసంపూర్ణమైనా, పూర్ణ కర్మ క్షయానికి అది సహాయ పడుతుంది. ఎవనికి అనన్య భక్తి ఉన్నదో, తన్ను పూర్తిగా భగవంతునికి అర్పణ చేసుకుంటున్నాడో వానికి ఈశ్వరుడు ఎన్నడూ ప్రణష్టుడు కాదు. ఈశ్వరానుగ్రహం అతనికి అన్ని కాలములలోనూ ఉంటుంది. "ఈ జీవితాన్ని నీవు నాకు ప్రసాదించావు. నేను నా సాంప్రదాయాచార్యుని పాదములు నమ్ముకున్నాను" అని ఎవడైతే తన కులధర్మాన్ని అస్ఖలిత శ్రద్ధతో పాటిస్తున్నాడో, వానికి ఈశ్వరుడు పరిపూర్ణత అనుగ్రహిస్తాడు.

మన ఆచార్యుడే ఈశ్వరుడు అన్న విశ్వాసం మనకి ఉండాలి. గురువుకి స్వాత్మార్పణ చేసుకుంటే అది ఈశ్వరార్పణే. గురువు వద్ద చేసే ప్రపత్తి అది ఈశ్వర ప్రపత్తియే. ఈ విషయం ఉపనిషత్తులను పారాయణ చేసేటప్పుడు చెప్పే శాంతి పాఠంలో ఉంది.

యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై
తంహదేవం ఆత్మ బుద్ధి ప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే II


"ఎవడు బ్రహ్మను పూర్వం సృష్టించాడో, వేదములను అతనికి అనుగ్రహించాడో, ఆ ప్రకాశరూపుని, బుద్ధిప్రేరకుని మోక్షార్ధం శరణు చెందుతున్నాను".

ఒక సాంప్రదాయాన్ని అనుసరించక స్వబుద్ధిపై ఆధారపడేవానికి అనర్ధమే కలుగుతుంది. అట్టివారు చేసే హాని మూర్ఖులు చేసే హాని కంటే అధికం. ఒక సాంప్రదాయాన్ని అనుసరించని వాడు మూర్ఖుడని శంకర భగవత్పాదులు ఉపదేశ సాహస్రిలో చెప్పారు. జ్ఞానలాభానికి గురుభక్తి అవసరం. పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం కలుగుతుందన్న నిశ్చయం లేదు.

10. దేవతలే శిష్యులుగా ఉండడం
మనందరమూ సాంప్రదాయాన్ని వదలరాదు. సంప్రదాయ ఆచార్యుల యందు భక్తిని కలిగి ఉండాలి. గురువుల అడుగుజాడలలో మనం నడవాలి. మన ఆచార్యులందరూ పరమ గురుభక్తులే.

మనకు మొదటి గురువు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి పరమేశ్వరుడే. ఆయనకూడా ఒక గురువుని వరించి ఉపదేశం పొందవలసి వచ్చింది. ఆయన తనపుత్రుని వద్ద వినయవిధేయతలతో ప్రణవం ఉపదేశం పొందాడు.

జ్ఞాన స్వరూపమే అంబిక (అమ్మవారు). ఆమె కూడా తన భర్త ఈశ్వరుని వద్ద శిష్యరికం చేసింది. ఆమెకు ఈశ్వరుడు ఆగమములను, తంత్రములనూ ఉపదేశించాడు. అంతేకాదు ఆమెకు క్రింది తారక మంత్రాన్ని కూడా ఉపదేశించాడు.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే II

మూరు మార్లు రామ నామం చేస్తే అది వేయి విష్ణు నామాలు చేసినంత పుణ్యం.

ఈశ్వరుడు అంబికకి ఉపదేశించాడు అన్న విషయం ఎన్నో స్థలపురాణాలలోనూ ఉన్నది. మహావిష్ణువు రామకృష్ణాది అవతారములలో గురుకుల వాసం చేశాడు. రాముడు వశిష్ఠుని వద్ద, కృష్ణుడు సాందీపమహర్షి వద్ద గురుకుల వాసం చేశారు. కృష్ణుడు తన సహాధ్యాయి అయిన సుధామునితో వానలో, తుఫానులో వంట చెఱకు కోసం వెళ్ళాడు. చిత్రకూటంలో భరతునితో పాటు వశిష్టుడు వచ్చి రాముని తిరిగి అయోధ్యకి రమ్మని కోరినప్పుడు, ఆయన గురువు యొక్క సమ్మతితో, అయోధ్యకి మరలి వచ్చుటకు నిరాకరించాడు. ఈ నిరాకరన కూడా వినయపూర్వకముగానే చేశాడు.

గురుపరంపరలో దత్తాత్రేయస్వామికి ఒక విశిష్ట స్థానమున్నది. భాగవతంలో ఆయన తనకు 24 గురువులు ఉన్నట్లు చెప్పాడు. భూమి, నీళ్ళు, కొండచిలువ, కందిరీగ, వేశ్య, వేటగాడు, శిశువు - వీళ్లంతా ఆయనకి గురువులు అన్నాడు. ఒక్కక్కరి వద్దా ఒక్కో పాఠం తాను నేర్చుకున్నట్లు ఆయన వివరంగా చెప్పుకున్నాడు.(సశేషం ......)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

No comments:

Post a Comment