A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Friday, March 15, 2013

అంబికానుగ్రమే దీక్ష

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

5. అంబికానుగ్రమే దీక్ష
సచ్చిదానందమని మనం చెబుతూ ఉంటాము. చిత్ అనే పదానికి జ్ఞానం అని అర్ధం. అంబికయే జ్ఞాన స్వరూపిణి. లలితాసహస్ర నామాలలో చిదేకరసరూపిణి అని ఒక నామం ఉన్నది. ఏకరసము చిత్తే. శ్రీకాళహస్తిలో అమ్మవారిని జ్ఞానప్రసూనాంబ అని అంటారు.

గురురూపములో వచ్చి మనల్ని అనుగ్రహించేది అంబికయే. కాళిదాసు "దేశిక రూపేణ దర్శితభ్యుదయాం" అని అమ్మవారిని కీర్తించారు. దేశికుడంటే గురువే. వైష్ణవ సాంప్రదాయ ఆచారములో వేదాంతదేశికులొకరు. భగవత్పాదుల శిష్యుడు తోటకాచార్యులు ఆయన చేసిన తోటకాష్టకంలో 'శంకర దేశికమే శరణం' అని ప్రార్ధించారు. దేశికుడంటే అన్ని ప్రదేశాలను ఎరిగిన వాడు, శాస్త్ర నిష్ణాత. దేశికుని రూపములో అంబ అవతరించి శిష్యుణ్ణి స్పర్శ, నయన, స్మరణ దీక్షలతో అనుగ్రహిస్తున్నది.

స్పర్సదీక్షను కుక్కుటదీక్ష అనీ, నయనదీక్షను మత్స్య దీక్ష అనీ, స్మరణదీక్షని కమఠ దీక్ష అనీ అంటారు.

గురువు అనుగ్రహించిన దీక్ష ప్రతిభావంతమై ఉంటే, ఆ శిష్యుడు తన అర్ధరహితమైన జీవితానికి స్వస్తిచెప్పి పరమార్ధిక పథగాముడై పోతాడు. నిజానికి అది అతనికి ఒక పునర్జన్మ అనే అనాలి. అందులకే గాయత్రీ మంత్రోపదేశం చేత ఒకడు ద్విజుడౌతున్నాడు. ద్విజ అంటే రెండో పుట్టుక.

అంటే దీక్షకు ముందు ఒక జన్మ ఉండినదనీ, దీక్ష పిదప మరల అతను జన్మిస్తున్నాడనీ కాదు దీనర్ధం. దీక్షకు ముందుకూడా అతడు అంతరంగములో బ్రహ్మభేదముగా ఉండినప్పటికీ, అతనికి ఆ ఎరుక లేకపోవడం చేత, అతను అజ్ఞానము నందు ఉండినాడు. దీక్షా మూలముగా ఆ అజ్ఞానమనే పొర అతనిని వీడిపోయింది. ఒక కోడి గుడ్లు పెట్టి దానిపై కూర్చుని పొదిగినప్పుడు, గుడ్డును పగులగొట్టుకొని పొర నుండి బయటపడే కోడిపిల్ల వలే, శిష్యుడూ, గురువు అనుగ్రహించిన కుక్కుట దీక్షా మూలముగా (కుక్కుటం అంటే కోడి) అజ్ఞానం అనే అండాన్ని భేదించుకొని, జ్ఞాని ప్రపంచములో పడుతున్నాడు. తన నిజతత్త్వమేమో తెలుసుకుంటున్నాడు.

నీళ్లలో చేపలు గ్రుడ్లు పెడతాయి. ఆ గ్రుడ్లు నీళ్ళలో తేలుతూ ఉంటాయి. చేపలు ఆ గ్రుడ్లపై కూర్చుని పొదగడంలేదు. తేలుతూ ఉన్న ఆగుడ్లని అవి చూసినంత మాత్రాన, అవి చేపపిల్లలౌతాయని మన శాస్త్ర సాంప్రదాయం. అందుకే గురువు యొక్క వీక్షా దీక్షని మత్య్స దీక్ష అని అంటారు.

ఇక కమఠ దీక్ష సంగతి అంటే తాబేలు. తాబేలు గ్రుడ్లను ఇసుకలో పెట్టి మళ్ళా నీళ్లలోకి వెళ్ళిపోతుంది. ఆ గుడ్ల సమక్షంలో లేకపోయినా తాబేలుకు అదే ధ్యాస. ఆ పిల్లలు సుఖంగా గుడ్ల నుంచీ బయట పడతాయా లేదా అని విచారిస్తూనే ఉంటుంది. దాని స్మరణ బలం చేతనే గుడ్లు పొదగబడి తాబేలు పిల్లలు బయటకి వస్తాయి. అందుకే గురువు యొక్క స్మరణ దీక్షను కమఠ దీక్ష అని కూడా అంటారు.

అంబిక ఏ విధముగా దేశిక రూపములో ఈ మూడురకాలైన దీక్షలను మనకు అనుగ్రహిస్తున్నది??
అంబిక (అమ్మవారు) అక్షత్రయమని, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని మూడు రూపాలలో ఆవిర్భవించి ఉన్నది. ఆమె అనుగ్రహించేది స్పర్శ దీక్ష. భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో..

శృతీనాం మూర్ధానో దధతి తనయౌ శేఖరతయా
మమాస్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌః


"అమ్మా!! నీ పాదాలను ఆ శృతి శిరస్సులనబడే ఉపనిషుత్తులే తలదాల్చి ఉన్నవి. అట్టి నీ చరణములను నా శిరస్సుపై ఉంచి, నన్ను అనుగ్రహించు అని వేడుకుంటూన్నారు. ఉపనిషత్తులు వేదాంతాన్ని బోధిస్తాయి. శంకరుల జ్ఞాన మార్గము వేదాంత సాంప్రదాయమే.
జ్ఞానస్వరూపిణియే కామాక్షి. ఆమెను భగవత్పాదుల వారు స్పర్శ దీక్షకై ప్రార్ధిస్తున్నారు.

మదురలో మీనాక్షి అమ్మ ఉన్నది, ఆమె మీన నేత్ర. ఆమె మనకి అనుగ్రహించే దీక్ష నయన దీక్ష. ఆమె కటాక్షములే మనకు జ్ఞాన దీక్ష ఇస్తున్నది. ఇకపోతే కాశీలో విశాలాక్షి ఉన్నది, ఆమె సర్వకాలములలోనూ మనల్నే స్మరిస్తూ, స్మరణదీక్షా ప్రదానం చేస్తున్నది. ఆమె అనుగ్రహించేదే కమఠ దీక్ష.

ఈ విధంగా అంబిక మూడు రూపాలలో మూడు విధాలైన దీక్షలను అందరికీ అనుగ్రహిస్తూ పరతత్త్వజ్ఞానదానం చేస్తూఉన్నది.

(సశేషం ......)

గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!


సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

No comments:

Post a Comment