A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Friday, March 15, 2013

దీక్ష

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు


దీక్ష
ఉపదేశమూలకముగా గురు-శిష్య సంబంధం ఏర్పడుతున్నదనే విషయం గురించి ఇంతవరకూ చెప్పాను. శాస్త్ర పరిభాషలో దీనినే "దీక్ష" అంటారు. తమిళంలో దీనిని "దీక్కై" అని చెబుతారు. ఉపదేశమూలకముగా గురువు నుంచి ఒక చైతన్యము శిష్యుడిలో ప్రవేశించి, తీవ్ర సంవేగాన్ని కల్పించి, ఆధ్యాత్మ మార్గములో ఒక అన్వేషణకి పురికొల్పేదే దీక్ష. ఈ చైతన్యం దీక్ష అయిపోయినంతనే అంతరించిపోవడం లేదు. ఈ చైతన్యము శిష్యునిలో ప్రవిష్టమై, అతనిని ఆధ్యాత్మంలో ఉన్నత లక్ష్యాలకు తీసుకువెళ్ళి, మంత్రసిద్ధి కలుగజేస్తున్నది.

గురువు ఒక్కమారైనా సరే, మంత్రోపదేశం చేసియో, కటాక్షమూలకముగానో, హస్తమస్తక స్పర్శనం చేతనో, అనుకంపన చేతనో గురుశిష్య సంబంధమైన దీక్షని ఇచ్చినట్లైతే, ఆ అనుగ్రహం శిష్యుని మీద ఎల్లకాలమూ ఉంటుంది. స్విచ్చిని నొక్కి ఉంచినంతసేపూ బల్బు వెలిగేట్లు ఈ అనుగ్రహం పనిచేస్తుంది. ఆచార్యుడు శిష్యుడిని సమక్షంలో ఉంచుకుని దీర్ఘ కాలం అతనికి విద్యను, అనుష్టాన విధానాలను బోధించాల్సి ఉంటుంది. గురువు విషయం అట్లా కాదు. అతనికి శిష్యునితో స్థూల సంబంధం అక్కర్లేదు. అతనికి ఒక్క క్షణం ఉంటే చాలు. కొన్ని సమయాలలో అదికూడా అక్కర్లేదు. అతని అనుగ్రహం దీక్షామూలకముగా ప్రసరించి, శిష్యుని సంసారాన్ని క్షణంలో భస్మం చేస్తుంది. శిష్యునికి సిద్ధి ప్రాప్తించేవరకు, గురువు అనుగ్రహం అన్నికాలాలలోనూ అతనితో ఉంటుంది.

దీక్ష ఇచ్చినవాడు గురువు. భారత, రామాయణాదులలో, పురాణాలలో తండ్రియే గురువని చెప్పబడినది. తండ్రి ఘనుడైనా సరే, కాకపోయినా సరే, మహాత్ముడైనా సరే కాకపోయినా సరే, తనయునికి అతను దైవసమానుడే. వేదాలు పితృదేవోభవ అని కూడా చెప్పినవి. తండ్రిని గురువుగా భావించడానికి మరో కారణం కూడా ఉంది. పుత్రునికి బ్రహ్మోపదేశ సమయంలో తండ్రియే కదా గాయత్రీ మంత్ర దీక్ష ఇస్తున్నది? తండ్రిని గురువుగా భావించడానికి ఈ ఆచారము కూడా కారణము.

ఇదే కాదు, అక్షరాభ్యాసకాలంలో, తండ్రి కుమారునికి "ఓమ్ నమో నారాయణాయ" అని అష్టాక్షరియో, "ఓం నమః శివాయ" అని పంచాక్షరీయో ఉపదేశం చేసే ఆచారం మనలో ఉంది. ఈ కారణంగా కూడా తండ్రి కుమారునికి గురువు అవుతున్నాడు. గురువు వద్ద శరణుజొచ్చిన శిష్యుడు శరణాగతి కారణంగా జ్ఞానలాభాన్ని పొందుతున్నాడు. ఈ జ్ఞానోపలబ్ధికి గురువు యొక్క లాఘవం కానీ, అనుభూతి రాహిత్యంకానీ అడ్డురాదు. శరణాగతి యొక్క మహాత్మ్యం అలాంటిది.

ఇలాంటి గురుభక్తి గురించి చెప్తున్నప్పుడు, కంచి మఠంలో జరిగిన ఒక ఉదంతం జ్ఞప్తికి వస్తున్నది. మఠ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు కుర్రవాళ్లని చూచి, మీ అధ్యాపకులు వచ్చారా అని నేను అడిగాను. ఒక బాలుడు ఇంకా రాలేదు అని బదులిచ్చాడు. రెండవ వాడు "ఆ! వచ్చారు" అని బదులు చెప్పాడు. నిజానికి అధ్యాపకుడు రాలేదు. రెండవ అబ్బాయితో ఎందుకు నీవు ఈ విషయములో అబద్ధము చెప్పావు అని నేను అడుగగా, "గురువు రానిదేమో నిజమే! ఆయన రాలేదంటే ఆయన లోపం చూపినట్లవుతుంది. అందుచేత నిజం చెప్పి గురువు యందు దోషం చూపేదాని కన్నా, అబద్ధం చెప్పి దోషాన్ని చూపకుండుట మంచిదని తోచి అట్లు చెప్పాను" అని అన్నాడు.

గురువు యోగ్యత ఎలాంటిదైనా సరే, శిష్యునికి అఖండమైన, అనన్యమైన భక్తి ఉంటే, అతనిని ఈశ్వరానుగ్రహం వెన్నంటియే ఉంటుంది.

మనం ఏ విషయాన్నైనా స్వయంగా నేర్చుకుంటే అది అహంకారానికి దారితీస్తుంది. ఏ విద్యకైనా ఒక గురువు అవసరం. మంత్రములు కూడా స్వయంగా గ్రహించినవి కాక, గురూపదేశములై ఉండవలె. గురువు లేకుండా తీసుకున్న మంత్రమో, చదివిన విద్యయో, "భార్యకు ఆమె ప్రియుడి చేత కలిగిన సంతానము వంటిది, అతనిని కుమారుడని పిలుచుకోవచ్చు, కానీ వైదిక కర్మలు చేయడానికి అతనికి అర్హత లేదు".

అందుచేత దీక్షకు గురువు అనివార్యము. వాగ్రూపక దీక్ష - మంత్రోపదేశము, కటాక్షముతో అనుగ్రహించే దీక్ష - నయనదీక్ష, శిష్యుని స్పర్శతో అనుగ్రహించేది స్పర్శ దీక్ష. భగవత్పాదులు - అంటే భగవంతుని పాదములు శిరసా గ్రహించి, ఆ పాదములే తాను అయినవాడు అని అర్ధం. అనగా మనం శంకర భగవత్పాదుల వారిని శిరసా ధరించాలి. గురువు ప్రత్యక్షోపదేశం ఇవ్వవలసిన అవసరం లేదు. ఎక్కడో దూరాన గురువు కూర్చుని శిష్యుని స్మరించినంత మాత్రాన, శిష్యునికి స్మరణ దీక్ష లభ్యమౌతున్నది.

(సశేషం ......)సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

No comments:

Post a Comment